Kokapet: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కోకాపేట నియోపొలీస్ లే-అవుట్లో బుధవారం హెచ్ఎండీఏ నిర్వహించిన మూడో విడత భూముల ఈ-వేలంలో మరోసారి భూముల ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. ముఖ్యంగా, ఎకరం భూమి ఏకంగా ₹131 కోట్లు పలకడం రియల్ ఎస్టేట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.
నియోపొలీస్లో ధరల ప్రభంజనం
హెచ్ఎండీఏ ఈ వేలంలో కోకాపేటలోని నియోపొలీస్ లే-అవుట్లో ప్లాట్ నంబర్ 19, 20లను అమ్మకానికి ఉంచింది. ప్లాట్ నంబర్ 19: 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాట్‌లో ఎకరం భూమికి అత్యధికంగా ₹131 కోట్లు పలికింది. ఈ ప్లేట్ ని యు అండ్ లా కన్స్ట్రక్షన్ ఎల్ఎల్పి, గ్లోబల్ ఇన్ఫ్రాంకో ఎల్ఎల్పి సంస్థలు దక్కించుకున్నాయి.
ప్లాట్ నంబర్ 20: 4.04 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాట్‌లో ఎకరానికి ₹118 కోట్లు ధర లభించింది. బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ కొనుకుంది. మొత్తంగా, 8.04 ఎకరాల భూమిని విక్రయించడం ద్వారా హెచ్ఎండీఏకు ₹1000 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.
రియల్ ఎస్టేట్ మార్కెట్లో సానుకూల ఫలితం
గత రెండు దశల వేలం ధరలతో పోలిస్తే ఈసారి ధర కొంచెం తక్కువగా పలికినప్పటికీ, ప్రస్తుత రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితులలో ఇది ఆశించిన ఫలితమేనని అధికారులు తెలిపారు. తాజా లెక్కల ప్రకారం, నియోపొలీస్ ఏరియాలో ఎకరం భూమి సగటు ధర ₹137.36 కోట్లుగా నమోదైంది. కోకాపేట నియోపొలీస్లో దశలవారీగా భూముల విలువ పెరుగుతుండటం స్థిరాస్తి మార్కెట్ బలంగా ఉందనడానికి నిదర్శనం.
ఇది కూడా చదవండి: Virat Kohli: సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ
గోల్డెన్ మైల్ వేలంపై భారీ అంచనాలు
కోకాపేటలో భూముల విలువ పెరిగిన నేపథ్యంలో, డిసెంబర్ 5న నిర్వహించనున్న గోల్డెన్ మైల్ భూముల వేలంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ వేలంలో కూడా రికార్డు స్థాయి ధర పలకవచ్చని హెచ్ఎండీఏ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గోల్డెన్ మైల్‌లోని 1.98 ఎకరాల భూమిని వేలం వేయనున్నారు.
ముసాపేట వేలం రద్దు: అనివార్య కారణాలు!
కాగా, అదే రోజు (డిసెంబర్ 5) వేలం వేయాలని నిర్ణయించిన ముసాపేటలోని 15 ఎకరాల భూముల వేలాన్ని రద్దు చేస్తున్నట్టు హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వై జంక్షన్ సమీపంలో ఉన్న ఈ భూముల వేలాన్ని “కొన్ని అనివార్య కారణాల” వల్ల తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు కమిషనర్ వెల్లడించారు. అయితే, ఒక ప్రజాప్రతినిధి నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే హెచ్ఎండీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటివరకు, హెచ్ఎండీఏ మూడు విడతల్లో ఆరు ప్లాట్లలోని మొత్తం 27 ఎకరాలను వేలం వేయగా, దీని ద్వారా ప్రభుత్వానికి ₹3,708 కోట్లు ఆదాయం లభించింది.

