Hurun India Report 2025: భారతదేశ ఆర్థిక వ్యవస్థలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల వివరాలను ఐడీఎఫ్‌సీ ఫస్ట్ ప్రైవేట్ – హురున్ ఇండియా సంస్థ వెల్లడించింది. స్వయంకృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తల జాబితాలో ఈసారి విమానయాన రంగ దిగ్గజం ఇండిగో వ్యవస్థాపకులు సంచలనం సృష్టించారు.
ఇండిగో ప్రమోటర్ల విజయగాథ ఇండిగో సంస్థకు మాతృసంస్థ అయిన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ అధినేతలు రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్ తమ అద్భుత పనితీరుతో మొదటిసారిగా ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకోవడమే కాకుండా నేరుగా టాప్-10లో నిలిచారు. 2025 నాటికి ఈ సంస్థ మార్కెట్ విలువ ఏకంగా రూ. 2.2 లక్షల కోట్లకు చేరుకోవడంతో వీరు ఈ జాబితాలో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అత్యధిక ఆదాయం గడిస్తున్న కంపెనీల విభాగంలో కూడా రూ. 84,098 కోట్ల ఆదాయంతో ఇండిగో అగ్రస్థానంలో నిలవడం విశేషం.
దీపిందర్ గోయల్ నంబర్ వన్ జొమాటో, బ్లింకిట్ వంటి ప్రముఖ బ్రాండ్లను నిర్వహిస్తున్న ఎటర్నల్ సంస్థ అధిపతి దీపిందర్ గోయల్ రూ. 3.2 లక్షల కోట్ల మార్కెట్ విలువతో దేశంలోనే అత్యంత విజయవంతమైన సెల్ఫ్ మేడ్ ఎంటర్‌ప్రెన్యూర్ గా మొదటి స్థానంలో నిలిచారు. గత ఏడాది ప్రథమ స్థానంలో ఉన్న డిమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ మార్కెట్ విలువ తగ్గడంతో రెండో స్థానానికి చేరుకున్నారు. టెక్ కన్జూమర్ రంగంలో పేటీఎం, లెన్స్‌కార్ట్ వంటి సంస్థలు తమ బలాన్ని పెంచుకొని టాప్-10లో చేరగా, రాజోర్‌పే మరియు జెరోధా సంస్థలు మాత్రం ఈసారి మొదటి పది స్థానాల నుండి వెనుకంజ వేశాయి.
Also Read: IND vs SA T20: లఖ్‌నవూలో భారత్–దక్షిణాఫ్రికా నాలుగో టీ20 రద్దు
ప్రపంచ సంపన్న కుటుంబాల్లో అంబానీ బ్లూమ్‌బర్గ్ ప్రకటించిన ప్రపంచంలోని టాప్ 25 సంపన్న కుటుంబాల జాబితాలో భారతదేశం నుండి ముకేశ్ అంబానీ కుటుంబం మాత్రమే చోటు సంపాదించుకుంది. దాదాపు రూ. 9.50 లక్షల కోట్ల సంపదతో అంబానీ కుటుంబం ప్రపంచవ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచింది. ఈ అంతర్జాతీయ జాబితాలో వాల్‌మార్ట్ అధినేత వాల్టన్ కుటుంబం రూ. 46.20 లక్షల కోట్ల సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
నగరాల వారీగా పారిశ్రామికవేత్తలు భారతదేశంలో స్టార్టప్ రాజధానిగా పిలవబడే బెంగళూరులో అత్యధికంగా 88 మంది పారిశ్రామికవేత్తలు ఉండగా, ముంబయి 83 మందితో రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ నగరం 8 కంపెనీలకు చెందిన 12 మంది పారిశ్రామికవేత్తలతో దేశవ్యాప్తంగా ఏడో స్థానంలో నిలిచింది. మొత్తం మీద బిలియన్ డాలర్ల విలువ కలిగిన కంపెనీల సంఖ్య దేశంలో 128కి చేరడం భారత పారిశ్రామిక రంగ వృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.
