Ys Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ఎంపీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ హక్కులు, విభజన హామీలపై ఒక్క మాటా మాట్లాడకుండా మౌనంగా కూర్చోవడం అవమానకరమని ఆమె వ్యాఖ్యానించారు. శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టారని షర్మిల ఆరోపించారు.
రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు గడిచినా, అప్పటి హామీలలో ఒక్కదానికీ సరైన పురోగతి లేదని షర్మిల అసహనం వ్యక్తం చేశారు. “మన ఎంపీలు బుద్ధిమంతుల్లా వెనుక బెంచ్‌లలో కూర్చొని మోదీ మాట్లాడితే చప్పట్లు కొట్టడానికే పరిమితమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలు కంటే వ్యక్తిగత లాభాలే ముఖ్యమయ్యాయి” అని ఆమె విమర్శించారు.
పేరుకు వేర్వేరు పార్టీలకు చెందినవారైనా, ఎంపీలు అందరూ ప్రధాని మోదీకి రబ్బర్ స్టాంపుల్లా మారిపోయారని షర్మిల హెచ్చరించారు. బీజేపీ ప్రవేశపెట్టే బిల్లులకు గొర్రెల్లా తలూపుతూ మంటూ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ధైర్యంగా నిలబడలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విభజన హామీలను ప్రజలకు ఇచ్చిన చెక్కులతో పోల్చిన షర్మిల, “2014లో ఈ హామీల విలువ రూ. 5 లక్షల కోట్లు. కానీ ఆ చెక్కు ఇప్పటికీ ఎన్‌క్యాష్ కాలేదు. పోలవరం ఎత్తు 41 మీటర్లకే పరిమితం చేసినా, అమరావతికి కేంద్రం సాయం చేయలేదని పార్లమెంటరీ కమిటీ స్పష్టంగా తెలిపినా… మన ఎంపీలు గుడ్డి గుర్రాల్లా మౌనం వహిస్తున్నారు” అని విమర్శించారు.
రాష్ట్రంలో 25 మంది లోక్‌సభ, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారని గుర్తు చేస్తూ — “మీరు నిజంగా తెలుగు బిడ్డలైతే, మీ రక్తంలో తెలుగు వాడి గౌరవం ప్రవహిస్తే, ఇప్పటికైనా విభజన హామీలపై నోరు విప్పండి. ప్రధాని మోదీ మోసాలను పార్లమెంటు వేదికగా నిలదీయండి” అని షర్మిల బలంగా డిమాండ్ చేశారు.

