Ys sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ప్రయత్నాలను ఆమె తీవ్రంగా ఖండించారు. ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేసే కుట్రలకు కేంద్రం ఆజ్యం పోస్తూనే ఉందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని కేంద్రం తక్షణమే స్పష్టత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్రం అధికారిక ప్రకటన చేయాలని కోరారు. స్టీల్ ప్లాంట్‌ను SAILలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాలని సూచించారు.
ప్లాంట్ ఆర్థిక సమస్యలు ఎదుర్కొనేందుకు రూ.20,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్లాంట్‌కు భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ప్రత్యేక గనులను కేటాయించాలని అభ్యర్థించారు. ప్లాంట్‌కు ఉన్న 7 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించాలని కోరారు. 1400 రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికుల డిమాండ్లపై యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని, మూడు సంవత్సరాల పాటు ట్యాక్స్ హాలీడే ఇవ్వాలని కోరారు.
ఈ నెల 8న విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కూటమి పార్టీల నాయకులు స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన నిర్ణయాలు ప్రకటించకపోతే మోదీ విశాఖలో అడుగుపెట్టకూడదని ఆమె స్పష్టం చేశారు.