YS sharmila: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిన్న విజయవాడ జైలుకు వెళ్లి వల్లభనేని వంశీని పరామర్శించడంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. నేరస్తులను, దౌర్జన్యాలకు పాల్పడ్డ వారిని పరామర్శించేందుకు జగన్‌కు సమయం దొరుకుతుంది కానీ, ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్లే ధైర్యం మాత్రం లేదు అంటూ విమర్శలు గుప్పించారు.
“ప్రెస్ మీట్లు పెట్టి పురాణం చెప్పే తీరిక జగన్‌కు దొరుకుతుంది, కానీ అసెంబ్లీలో పాలకపక్షాన్ని నిలదీసే ధైర్యం మాత్రం లేదు” అంటూ ఆమె మండిపడ్డారు.
వైసీపీకి ప్రజల మధ్య తిరిగే అర్హత లేదు – షర్మిల
“ప్రజలు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను గెలిపిస్తే, వారు అసెంబ్లీకి రాకుండా మారాం చేయడం సమంజసం కాదు. ఇలాంటి నాయకులకు ప్రజల మధ్య తిరిగే అర్హతే లేదు. ప్రజా సమస్యలపై మాట్లాడే నైతికత అసలే లేదు” అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఈ సారి అయినా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలి. అక్కడే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. మరోసారి అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే, వెంటనే రాజీనామా చేయాలి” అంటూ ఆమె ట్వీట్ చేశారు.
ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం గమనార్హం.