YS Jagan

YS Jagan: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి..

YS Jagan: శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో జరిగిన దురదృష్టకరమైన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో పలువురు భక్తులు మరణించడం చాలా బాధాకరం అని ఆయన అన్నారు. మీడియా నుంచి అందిన సమాచారం ప్రకారం, ఈ ఘటనలో దాదాపు 10 మంది భక్తులు మరణించినట్లు తెలుస్తోంది. మరణించిన భక్తుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, అలాగే గాయపడిన వారికి మంచి చికిత్స అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తమ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని జగన్ ఆదేశించారు.

జగన్ మాట్లాడుతూ, గత 18 నెలల కాలంలో రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదనేది స్పష్టంగా అర్థమవుతోందని విమర్శించారు. గతంలో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు, సింహాచలంలో మరో ఏడుగురు భక్తులు మరణించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కాశీబుగ్గలో మరో 10 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం పూర్తి నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు.

ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల భక్తుల ప్రాణాలు పోతున్నాయని జగన్ ఆరోపించారు. ఈ దుర్ఘటనలు చంద్రబాబు నాయుడు అసమర్థ పాలనకు నిదర్శనమని తీవ్రంగా విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదకర సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *