YS Jagan

YS Jagan: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది: వై.ఎస్. జగన్ విమర్శలు

YS Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రస్తుత పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.  దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆయన నొక్కి చెప్పారు. తమ గత పాలనలో పండుగలా ఉన్న వ్యవసాయం, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దండగగా మారిందని ఆయన విమర్శించారు. రైతుల విషయంలో రాష్ట్రంలో “సేవ్ ఆంధ్రప్రదేశ్” అనే విధంగా పాలన నడుస్తోందని వ్యాఖ్యానించారు.

ప్రకృతి విపత్తుల విషయంలో ప్రభుత్వ వైఖరిని జగన్ ప్రశ్నించారు. మొంథా తుఫానుపై ఆర్టీజీఎస్ ద్వారా హడావుడి చేశారని, కానీ నష్టపోయిన రైతులకు మాత్రం సాయం అందలేదన్నారు. గడిచిన 19 నెలల కాలంలో సంభవించిన 17 ప్రకృతి విపత్తులకు గాను, రైతులకు చెల్లించాల్సిన రూ.1100 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ముఖ్యమంత్రి చెల్లించకుండా నిలిపివేశారని ఆరోపించారు. రైతుల హక్కుగా ఉన్న పంటల బీమా పథకాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేసిందని, అలాగే రైతు భరోసా కేంద్రాలు (RBKలు), ఈ-క్రాప్ వ్యవస్థలు పూర్తిగా కనుమరుగైపోయాయని ఆయన అన్నారు. అరటి, చీనీ వంటి పంటలకు కిలో 50 పైసల ధర లభిస్తుంటే రైతులు ఎలా బతకాలని ప్రశ్నిస్తూ, తమ హయాంలో ప్రత్యేక రైళ్లు నడిపి ఢిల్లీ, ముంబైకి ఎగుమతులు చేశామని గుర్తు చేశారు. కరెంట్ బిల్లు కట్టలేదనే నెపంతో కోల్డ్ స్టోరేజీలు మూతపడటం రైతులకు మరింత నష్టం చేకూరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలు అనేది అబద్ధమని జగన్ అన్నారు. అబద్ధాల ప్రచారంలో గోబెల్స్‌ను మించిపోయారని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గోబెల్స్‌కు టీచర్‌ అని ఎద్దేవా చేశారు. హామీలిచ్చి మోసం చేసిన వారిపై చీటింగ్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

Also Read: Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం!

విద్యారంగంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువులు మానేస్తున్నారని, ‘గోరుముద్ద’ పథకం గాలికి ఎగిరిపోయిందని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో ఆహారం ఏమాత్రం బాగోలేదని, కలుషిత ఆహారం కారణంగా 29 మంది పిల్లలు చనిపోయారని ఆయన ఆరోపించారు. వైద్య రంగంలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని, అత్యవసర సేవలకు ఉపయోగపడే 108, 104 అంబులెన్స్ సేవలను కూడా స్కాంగా మార్చేశారని విమర్శించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం ఒక స్కామ్ అని, ప్రైవేటుపరం చేసినా సిబ్బందికి ప్రభుత్వ జీతాలివ్వడం విడ్డూరమన్నారు. ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి, ఈ నెల 16న గవర్నర్‌కు సమర్పించనున్నట్లు జగన్ తెలియజేశారు.

ఉద్యోగుల బకాయిలు, పీఆర్‌సీపై అసంతృప్తి
ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్‌సీ ఒక బూటకమని జగన్ విమర్శించారు. తమ హయాంలో 27 శాతం ఐఆర్‌ (ఇంటెరిమ్ రిలీఫ్) ఇచ్చామని గుర్తు చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్‌సీ బకాయిలు, ఇతర రూపాల్లో ఉద్యోగులకు ప్రభుత్వం రూ.31 వేల కోట్ల బకాయిలు ఉందని అన్నారు. ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండగా ఒక్కటి మాత్రమే ఇస్తున్నారని, డీఏ అరియర్స్ రిటైర్మెంట్ తర్వాత ఇస్తామని చెప్పడం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లిందన్నారు. అలాగే, గెస్ట్ లెక్చరర్లకు 8 నెలలుగా జీతాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మాట్లాడుతూ, ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అని నినదించారు. ప్లాంట్ నష్టాలకు ఐరన్ ఓర్ మైన్స్ లేకపోవడమే కారణమని, అందుకే తాము గతంలో కేంద్రానికి మైన్స్ ఇవ్వాలని కోరామని చెప్పారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం మైన్స్ అడగకుండా ప్రైవేటుపరం చేస్తున్న కంపెనీకి మైన్స్ ఇవ్వాలని అడుగుతోందని విమర్శించారు.

Also Read: Narayana: అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రారంభం: మంత్రి నారాయణ

తిరుమల వివాదాలు, రాజకీయ కక్ష సాధింపు
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమల లడ్డూ కల్తీ అంశంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు అన్ని తీవ్రంగా మండిపడ్డారు. దేవుడంటే భక్తి, భయం లేని చంద్రబాబు లడ్డూలో కల్తీ జరిగిందని మాట్లాడుతున్నారని, చివరకు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి ఆరోపణలున్న ట్యాంకర్లు ప్రసాదం పోటులోకి వెళ్లాయనడానికి ఆధారాలు ఏవని ప్రశ్నించారు. టీటీడీలోకి వచ్చే ఏ నెయ్యి ట్యాంకర్ అయినా NABL ల్యాబ్తో పాటు టీటీడీ ల్యాబ్‌లోనూ తనిఖీలు పూర్తయ్యాకే అనుమతి ఇస్తారని, ఇది రొటీన్ ప్రోటోకాల్ అని వివరించారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక జులై నెలలో తిప్పి పంపిన ట్యాంకర్లే మళ్లీ ఆగస్టులో అనుమతి పొందాయని, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు, బాధ్యులెవరు అని ప్రశ్నించారు. గతంలో తమ హయాంలో కిలో నెయ్యిని రూ.276-రూ.318కు కొన్నారంటే అది కల్తీ నెయ్యేనా అని ప్రశ్నిస్తూ, ఇరికించాలనే ఆరాటంతోనే తప్పులు చేస్తున్నారని విమర్శించారు.

పరకామణి వివాదంపైనా స్పందించారు. కేవలం 9 డాలర్ల చోరీ కేసులో దొంగను పట్టుకోవడం నేరమవుతుందా, దీనికి ప్రాయశ్చిత్తంగా రూ.14 కోట్ల ఆస్తులను దేవుడికి ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కేసులో భూమన కరుణాకర్ రెడ్డిని ఇరికించేందుకు తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.

Also Read: Punugu Pilli: అరుదైన వివెర్ర పునుగు పిల్లి.. అంతరించిపోతున్న పునుగు పిల్లికి తిరుమల క్షేత్రానికి సంబంధం ఏమిటి? పునుగు పిల్లి చరిత్ర ఏమిటి!

అక్రమ కేసుల పాలన: రెడ్ బుక్ రాజ్యాంగం
రాష్ట్రంలో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం వెర్రితలలు వేస్తోందని, కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు వీళ్ళే పెట్టి, అన్నీ వీళ్ళ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కల్తీ మద్యం తయారీ జరిగిందని, కానీ తమ పార్టీ నేత జోగి రమేష్‌ను తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలతో అరెస్ట్ చేశారని, ఒక మాజీ మంత్రి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

అలాగే, మాచర్లకు చెందిన తమ పార్టీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై అక్రమ కేసులు పెట్టారని, టీడీపీలోని గ్రూపు తగాదాలతో జరిగిన హత్యలో వాళ్లే చంపుకొని తమ నాయకుడిని ఇరికించారని, ఈ విషయాన్ని సాక్షాత్తు ఎస్పీ కూడా ప్రకటించారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో రిగ్గింగ్‌ను అడ్డుకున్నందుకే పిన్నెల్లిని జైల్లో పెట్టారని అన్నారు. విశాఖలో తమ విద్యార్థి నేత కొండారెడ్డిని టిఫిన్‌కు వెళ్తుండగా అదుపులోకి తీసుకొని, గంజాయి కేసు పెట్టి అరెస్ట్ చేశారని, సీసీటీవీ ఫుటేజీలు ఉన్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న చంద్రబాబు.. ఆ కేసును నీరుగార్చేందుకు లేని కేసు సృష్టించారని, తమ పార్టీ నేతలు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారిని, రిటైర్డ్ అధికారులను అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇలాంటివి చేస్తేనే రాష్ట్రంలో నక్సలిజం పుడుతుందని జగన్ హెచ్చరించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *