Haider Ali: పాకిస్తాన్ యువ క్రికెటర్ హైదర్ అలీ ఇంగ్లాండ్‌లో అత్యాచార ఆరోపణలపై అరెస్టు అయ్యారు. పాకిస్తాన్ ‘A’ జట్టు అయిన ‘పాకిస్తాన్ షాహీన్స్’తో కలిసి ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అత్యాచారం ఆరోపణల కేసులో హైదర్ అలీని అరెస్టు చేశారు. ఈ సంఘటన జూలై 23, 2025న మాంచెస్టర్‌లోని ఒక భవనంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు హైదర్ అలీని అరెస్టు చేసి, ఆ తర్వాత విచారణ నిమిత్తం బెయిల్‌పై విడుదల చేశారు. అయితే, అతని పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Cricket: శుభ్‌మన్ గిల్‌కు కొత్త నాయకత్వ బాధ్యత: దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ కెప్టెన్‌గా ఎంపిక
ఈ విషయం తెలిసిన వెంటనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) హైదర్ అలీని తక్షణమే సస్పెండ్ చేసింది. పూర్తిస్థాయి విచారణ పూర్తయ్యే వరకు అతనిపై ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొంది. విచారణలో చట్టపరమైన ప్రక్రియలకు పూర్తిగా సహకరిస్తామని, అలాగే హైదర్ అలీకి అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని కూడా PCB తెలిపింది. ఈ ఘటన పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇది పాకిస్తాన్ క్రికెటర్లు ఇంగ్లాండ్‌లో వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. గతంలో స్పాట్ ఫిక్సింగ్ కేసులో సల్మాన్ బట్, మహ్మద్ ఆమీర్, మహ్మద్ ఆసిఫ్ వంటి ఆటగాళ్లు ఇంగ్లాండ్‌లోనే జైలు శిక్ష అనుభవించారు.