Yadagirigutta: తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం (మార్చి 1) నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నెల 11వ తేదీన డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. తొలిరోజు స్వస్తివాచనం, అంకురారోహణం పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 1 నుంచి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా రద్దు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు.
Yadagirigutta: ఆలయ ప్రధాన గోపురానికి స్వర్ణతాపడం పూర్తవడంతో మరింత శోభను సంతరించుకున్నది. ఈ బ్రహ్మోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి స్వామివారి భక్తులు తరలివస్తారు. హైదరాబాద్ నగరం నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నది.
Yadagirigutta: మలిరోజైన ఆదివారం (మార్చి2) ఉదయం 8 గంటలకు అగ్నిప్రతిష్ట, 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30 గంటలకు భేరీ పూజ, దేవతాహ్వానం, హవనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నెల 3న ఉదయం అలంకార, వాహన సేవలకు శ్రీకారం చుడతారు. ఉదయం 9 గంటలకు మత్స్యావతార అలంకార సేవ, వేదపారాయణం, రాత్రి 7 గంటలకు శేషవాహన సేవ ఉంటాయి.
Yadagirigutta: ఈ నెల 4న ఉదయం 9 గంటలకు వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు హంసవాహన సేవ, 5న ఉదయం 9 గంటలకు శ్రీ కృష్ణాలంకార సేవ, రాత్రి 7 గంటలకు పొన్నవాహన సేవ, 6న ఉదయం 9 గంటలకు గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు సింహవాహన అలంకార సేవ, 7న ఉదయం 9 గంటలకు జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవ, అనంతరం శ్రీస్వామివారికి ఎదుర్కోలు ఉత్సవం జరుగుతాయి.
Yadagirigutta: ఈ నెల 8 ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకార (హనుమంత వాహనం) సేవ, రాత్రి 8 గంటల నుంచి గజవాహన సేవ, 8.45 గంటలకు శ్రీ స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం జరుగుతుంది. 9న ఉదయం 9 గంటలకు శ్రీ మహావిష్ణువు అలంకార గరుడ వాహనసేవ, రాత్రి 8 గంటల నుంచి దివ్యవిమాన రథోత్సవం, 10వ తేదీన ఉదయం 10.30 గంటలకు మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం 7 గంటలకు శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన , 11న ఉదయం 10 గంటలకు శ్రీస్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు స్వామివారికి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.