Y. S. Sharmila: చారిత్రక నిర్ణయాలతో సంపద పెంచాం.. సెకీ ఒప్పందంతో కారు చౌకగా కరెంటు కొని రాష్ట్ర సంపదను ఆదా చేశాం.. అన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, శాలువాలు కప్పాలి, సన్మానాలు చేయాలి.. ఆ అవార్డులు కోరుకునే ముందు జగన్‌గారు కొన్నింటికి సమాధానాలు చెప్పాలంటూ శుక్రవారం ట్విట్టర్ వేదికగా షర్మిల పలు ప్రశ్నలను సంధించారు.
Y. S. Sharmila: 2021 మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్ఠంగా రూ.2.14 ఉంటే, తమరు రూ.2.49కి కొన్నందుకు శాలువాలు కప్పాలా? అదానీ వద్ద గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర రూ.1.99కి కొంటే అదే కంపెనీ నుంచి రూ.50 పైసలు ఎక్కువ పెట్టి రూ.2.49కి కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా? అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే, ఆగమేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకెళ్లినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా? అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని షర్మిల ప్రశ్నించారు.
Y. S. Sharmila: ట్రాన్స్‌మిషన్ చార్జీల భారం అక్కడ, ఇక్కడ లేకుంటే గుజరాత్‌కు ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి రూ.1.99కి అదానీ ఎందుకు ఇవ్వలేదు? రఊ.2.49 రేటుకు మీరెందుకు ఒప్పుకున్నారు. ట్రాన్స్‌మిషన్ చార్జీలు గరిష్ఠంగా యూనిట్ రూ.1.70 పడతాయని మీ హయాంలోనే ఇంధన శాఖ చెప్తుంటే ఎటువంటి చార్జీలు లేవని చెప్పే మీ మాటలు శుద్ధ అబద్ధం కాదా? ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపార వేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉన్నదా? దమ్ముంటే జగన్‌మోహన్‌రెడ్డి ఈ విషయాలపై సమాధానం చెప్పాలి అంటూ షర్మిల ప్రశ్నించారు.
Y. S. Sharmila: అదానీతో మీ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా ఒక చరిత్రే.. అదానీ కలవడం ఒక చరిత్ర. రూ.1,750 కోట్లు నేరుగా ముఖ్యమంత్రికి ముడుపులు ఇవ్వడమూ ఒక చరిత్ర. ఎవడు కొనేందుకు ముందుకు రాని విద్యుత్తును బంపర్ ఆఫర్‌గా ప్రకటించుకోవడమూ చరిత్రే. గంటల్లోనే క్యాబినెట్ మీటింగ్ పెట్టడం, ప్రజాభిప్రాయం లేకుండా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, అదానీ కోసం ఇతర అన్ని టెండర్లు రద్దు చేయడం, ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం ఏపీ రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.1.67 లక్షల కోట్ల భారాన్ని మోపడం, ప్రపంచం మొత్తం తమరి అవినీతి గురించి మాట్లాడుకోవడం, అవినీతిపరుల జాబితాలో మీ పేరు ఉండటం.. ఇవన్నీ మీకో పెద్ద చరిత్ర అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని షర్మిల ఎద్దేవా చేశారు.
Y. S. Sharmila: అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్టులో నాపేరు ఎక్కడుంది? అని జగన్ బుకాయిస్తున్నారని, ఆనాడు ఆంధ్రప్రదేశ్ సీఎం అంటే ఆయన కాదా? ఆ కుర్చీలో కూర్చున్నది ఆయనే కదా అని పేర్కొన్నారు. అవినీతి చేశారని ప్రత్యర్థి పార్టీలు చెప్పలేదని, అమెరికా దర్యాప్తు సంస్థలు తేల్చాయని స్పష్టం చేశారు. ముడుపులు ముట్టాకే ఒప్పందాలు చేసుకున్నారని తేల్చాయని చెప్పారు.
Y. S. Sharmila: గత టీడీపీ ప్రభుత్వం ఎక్కువ ధరకు పీపీఎల్ చేసుకున్నదని, రూ.35 వేల కోట్ల భారం వేసిందని చెప్పే మీరు.. అధికారంలోకి వచ్చాక గాడిదలు కాశారా? టెండర్ల రద్దుతోనే ఎందుకు సరిపెట్టారు? ఎందుకు విచారణ జరపలేదు? అని షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. నిజంగా అదానీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే, అదానీతో రహస్య ఒప్పందాలు జరగకుంటే, అమెరికా దర్యాప్తు సంస్థలు మీమీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే, మీరు అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయండి. దమ్ముంటే జగన్‌మోహన్‌రెడ్డి తన సవాల్‌ను స్వీకరించాలి అని షర్మిల్ స్పష్టం చేశారు.