Pushpa 2 Premiere: హైదారాబాద్ లో దారుణం జరిగింది. ‘పుష్ప2’ ప్రీమియర్ షో చూసే క్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్లో ఈ సినిమాను వీక్షించడానికి హీరో అల్లు అర్జున్ వచ్చారు. దాంతో ఆయనను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో ఎగబడ్డారు. బన్నీని చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా ముందుకు తోసుకుంటూ రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీఛార్జి చేశారు. హీరో అల్లు అర్జున్ రావడంతో సుమారు 200 మంది పోలీసులను మోహరించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద అర్ధరాత్రి 12 గంటల సమయంలోనూ అభిమానుల కోలాహలం నెలకొంది.
దాంతో తొక్కిసలాట చోటు చేసుకోగా రేవతి (39), ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సీపీఆర్ చేశారు. ఆ తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది. పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీతేజ్ ను పోలీసులు నిమ్స్‌కు తరలించారు. కుటుంబంతో కలిసి రేవతి దిల్సుఖ్నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌కు వచ్చింది.
మరికాసేపట్లో సినిమా చూస్తామనగా ఇలా అనుకోని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయింది.తొక్కిసలాటలో మరికొందరు స్పల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

