Seethakka: ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర నివేదికను ప్రజల ముందు ఉంచుతామని ప్రభుత్వం చెబుతుంటే, బీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని ఆమె ప్రశ్నించారు. కాళేశ్వరంపై చర్చ జరగకుండా ఉండేందుకు యూరియా కొరత పేరుతో రాజకీయం చేస్తున్నారని సీతక్క ఆరోపించారు.
కాళేశ్వరంపై బీఆర్ఎస్ భయం
‘కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, దానిపై చర్చకు సిద్ధం అని ప్రభుత్వం చెప్పింది. దీనిపై చర్చ అంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారు? ప్రజలకు వాస్తవాలు తెలియడం వారికి ఇష్టం లేదా?’ అని సీతక్క నిలదీశారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు బయటపడతాయన్న భయంతోనే బీఆర్ఎస్ ఈ విధంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు.
యూరియా కొరతపై రాజకీయం
యూరియా కొరతపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆందోళనలను సీతక్క ఖండించారు. ‘యూరియా కొరత అనేది కేంద్రం నుంచి సరఫరా లోపం వల్ల వచ్చింది. దీనిని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరగకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ఈ డ్రామాలు ఆడుతున్నారు’ అని ఆమె విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని ఆమె హామీ ఇచ్చారు.
రాహుల్ గాంధీ మాట ప్రకారం రిజర్వేషన్లు
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం, బీసీలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని సీతక్క తెలిపారు. ‘కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం ప్రకారం, బీసీ రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని ఎత్తివేశాం. త్వరలో దీనిపై ప్రత్యేక జీఓలు జారీ అవుతాయి. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం, ప్రజలందరినీ సమానంగా చూస్తూ, వారికి అవకాశాలు కల్పిస్తాం’ అని సీతక్క స్పష్టం చేశారు.