IPL 2025: ఐపీఎల్-2025 మెగా వేలంలో బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి జాక్పాట్ తగిలింది. ఈ 13 ఏళ్ల యువ క్రికెటర్ను రూ.1.10 కోట్లకు రాజస్తాన్ రాయల్స్ కైవసం చేసుకుంది. తద్వారా ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు.
అతడి ప్రస్తుత వయస్సు 13 ఏళ్ల 243 రోజులు మాత్రమే. రూ.30లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సూర్య వంశీ కోసం తొలుత రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి. ఆఖరికి ఢిల్లీ క్యాపిటల్స్ రేసు నుంచి వైదొలగడంతో ఈ యువ క్రికెటర్ను రాజస్తాన్ తమ సొంతం చేసుకుంది.
ఇది కూడా చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఆసీస్ కు సొంతగడ్డపై ఘోర పరాభవం!
ఎవరీ వైభవ్ సూర్యవంశీ?
13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 2011లో బిహార్లోని తాజ్పుర్ గ్రామంలో జన్మించాడు. అతడికి చిన్నతనం నుంచే క్రికెట్ అంటే మక్కువ ఎక్కువ. ఆ దిశగానే వైభవ్ అడుగులు వేశాడు. అతడు అద్భుతమైన క్రికెటర్గా ఎదగడంలో అతడి తండ్రి సంజీవ్ సూర్యవంశీది కీలక పాత్ర.
8 ఏళ్లకే వైభవ్ను క్రికెట్ అకాడమీలో చేర్పించి రెండేళ్లపాటు శిక్షణ సంజీవ్ ఇప్పించాడు. ఈ క్రమంలోనే కేవలం 12 సంవత్సరాల 284 రోజుల వయస్సులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టి వైభవ్ చరిత్ర సృష్టించాడు.
2023-24 రంజీ ట్రోఫీ సీజన్లో బిహార్ తరపున ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేశాడు. తద్వారా రంజీ టోర్నమెంట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్లు రంజీ మ్యాచ్లు ఆడిన సూర్యవంశీ..87 పరుగులు చేశాడు.
ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలో ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన యూత్ టెస్ట్ సిరీస్లో వైభవ్ కేవలం 58 బంతుల్లో సెంచరీ చేసి సత్తాచాటాడు. ఈ క్రమంలోనే అతడిని రాజస్తాన్ రాయల్స్ పోటీపడి మరి సొంతం చేసుకుంది.