Deepak Prakash: బిహార్లో తాజాగా కొలువుదీరిన కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న దీపక్ ప్రకాశ్ (36) ఎవరనే అంశం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే, ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా గానీ, ఎమ్మెల్సీగా గానీ లేకపోయినా మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం అనూహ్య పరిణామం. దీపక్ ప్రకాశ్ తండ్రి, రాష్ట్రీయ లోక్ మోర్చా అధినేత ఉపేంద్ర కుష్వాహా, బిహార్ రాజకీయాల్లో కీలక నేత. ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. దీపక్ తల్లి స్నేహలత ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అందరూ స్నేహలత మంత్రి అవుతారని ఊహించారు. అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దీపక్ ప్రకాష్ మంత్రిగా ప్రమాణం చేశారు. దీపక్ ప్రకాశ్ త్వరలో ఎమ్మెల్సీగా నామినేట్ అవుతారని లేదా ఎన్నికవుతారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. పదవిలో లేని వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా, ఆరు నెలల్లోగా తప్పనిసరిగా ఏదో ఒక సభలో సభ్యత్వం పొందాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
వారసత్వ రాజకీయాలకు తాజా ఉదాహరణగా నిలిచిన ఈ ఎంపిక, బిహార్లో యువ నాయకత్వం, రాజకీయ వారసత్వంపై కొత్త చర్చకు తెరలేపింది. బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ (జేడీయూ) రికార్డు స్థాయిలో పదోసారి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, కొత్త ఎన్డీఏ (NDA) మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఇద్దరు ఉపముఖ్యమంత్రులు సహా మొత్తం 27 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

