Court Movie

Court Movie: తిరుపతిలో కోర్టు మూవీ లాగే హత్య…ఏం జరిగిందంటే…

Court Movie: తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం నరసింగాపురంలో జరిగిన ఘటన సినిమా కథను తలపిస్తోంది. ఇటీవల రిలీజ్‌ అయి మంచి టాక్ తెచ్చుకున్న కోర్టు సినిమా పోలి ఉన్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. యువకుడిని ప్రేమించిన యువతి మరణం పలు అనుమానాలకు తావిచ్చింది. ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగింది..?

ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో అచ్చం కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటన తెలిసిన వారంతా ‘కోర్టు’ సినిమాను పోలి ఉందంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత ప్రేమించింది. గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు.

అయితే కులాలు వేరు కావడంతో పాటు నిఖిత మైనర్ కావడంతో అజయ్‌తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తల్లిదండ్రలు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.నిఖిత మైనర్ కావడంతో, గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి, అతడిని జైలుకు పంపారు.

ఈ క్రమంలోనే నిఖిత గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి, నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఆ తర్వాత నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో, నిఖిత తల్లిదండ్రులు సుజాత, కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్తున్నాడు. నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు.

Also Read: Crime News: మైనర్‌ బాలికను కిడ్నప్ చేసి.. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు .

“ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు ఏదీ లేకుండా చేశారు,” అని అతడు కన్నీటితో వాపోయాడు. ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

అజయ్, నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్‌లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి,” అని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్‌కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు.

గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏమిటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *