Andre Russell: వెస్టిండీస్ విధ్వంసకర ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నిర్ణయం అతని అభిమానులను, క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆండ్రీ రస్సెల్ ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు తన అంతర్జాతీయ కెరీర్‌లో చివరివిగా ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌లు జూలై 20, 22 తేదీల్లో రస్సెల్ స్వస్థలమైన జమైకాలోని సబీనా పార్క్ స్టేడియంలో జరగనున్నాయి. రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్ నుండి నిష్క్రమించినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగులలో (ఐపీఎల్, బిగ్ బాష్, కరేబియన్ ప్రీమియర్ లీగ్ వంటివి) ఆడటం కొనసాగిస్తానని స్పష్టం చేశాడు.
Also Read: Amarnath Yatra: భారీ వర్ష సూచన.. అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత
ఇది తన ఫ్రాంచైజీ క్రికెట్ కెరీర్‌పై దృష్టి సారించడానికి తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది. 37 ఏళ్ల ఆండ్రీ రస్సెల్ 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2019 నుండి రస్సెల్ ఎక్కువగా టీ20 ఫార్మాట్‌లో మాత్రమే వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. వెస్టిండీస్ జట్టు 2012, 2016లో టీ20 వెస్టిండీస్ ప్రపంచకప్‌లను గెలుచుకోవడంలో రస్సెల్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఆండ్రీ రస్సెల్ ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడి 2 పరుగులు చేసి, 1 వికెట్ పడగొట్టాడు. 56 వన్డే మ్యాచ్‌లలో 1034 పరుగులు చేసి 70 వికెట్లు తీశాడు. 84 టీ20 మ్యాచ్‌లలో 1078 పరుగులు చేశాడు (163.08 స్ట్రైక్ రేట్‌తో), 61 వికెట్లు పడగొట్టాడు. ఆండ్రీ రస్సెల్ తన విధ్వంసకర బ్యాటింగ్, వేగవంతమైన బౌలింగ్, అద్భుతమైన ఫీల్డింగ్‌తో క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించాడు.