Venkaiah Naidu: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఆదివారం తెల్లవారుజామున తన హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూశారు.
అద్భుతమైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసిన కోట, సినీ రంగంలో తనదైన ముద్రవేసిన గొప్ప నటుల్లో ఒకరు. ఆయన యాక్టింగ్‌లో ఉన్న ప్రత్యేకత, హావ-భావాలతో పాత్రను బతికించేవారు. మంచి విలన్‌గా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన ఎన్నో వేర్వేరు కోణాల్లో మెప్పించారు. సినీ జీవితంలో 400కి పైగా సినిమాల్లో నటించారు.
కోట శ్రీనివాసరావు మృతి వార్త వినగానే సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోట భౌతిక కాయాన్ని సందర్శించి, ఆయన కుటుంబ సభ్యులను
పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
“కోట గారు ఒక విలక్షణ నటుడు మాత్రమే కాదు, మంచి మానవతావాది కూడా. శాసనసభ్యుడిగా కూడా ప్రజలకు సేవ చేశారు. కుమారుడి అకాల మరణంతో ఆయన ఎంతో బాధపడ్డారు. అలాంటి మంచి నటుడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను,” అన్నారు.
కోట శ్రీనివాసరావు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఓ గొప్ప నటన రత్నాన్ని కోల్పోయింది. ఆయన జ్ఞాపకాలతో అభిమానులు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు దిగ్భ్రాంతికి లోనయ్యారు.