Srisailam: నవంబర్ మాసం రెండు లేదా మూడో వారంలో సీప్లేన్ ద్వారా ట్రయల్ రన్ నిర్వహించే అవకాశం ఉందని అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం శ్రీశైలంలోని పాతాళ గంగ వద్ద వాటర్ ఎయిర్ డ్రోమ్ ల్యాండ్ అయ్యే బోటింగ్ పాయింట్ ను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ నవంబర్ మాసం రెండు లేదా మూడో వారంలో సీప్లేన్ ద్వారా ట్రయల్ రన్ నిర్వహించే అవకాశం ఉందని అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను సూచించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రోప్ వే పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని పర్యాటక రంగ అధికారులను ఆదేశించారు.
ప్లాస్టిక్ జెట్ ఏర్పాటుతో పాటు ల్యాడర్ కు డెకరేషన్ చేయాలన్నారు. రోప్ వే భవనం, క్యాబిన్, నడకదారుల్లో పారిశుధ్య చర్యలు చేపట్టి పెయింటింగ్ వేసి ఆకర్షణీయమైన రీతిలో తీర్చిదిద్దాలన్నారు. ఆత్మకూరు ఆర్డీఓ ఎం. దాసు, డ్యామ్ ఎస్ఈ రామచంద్రరావు, ఆత్మకూరు, శ్రీశైలం డిఎఫ్ఓలు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, శ్రీశైల దేవస్థానం అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.