Warangal

Warangal: వరంగల్‌‌ మాస్టర్‌‌ ప్లాన్‌‌కు మోక్షం కలిగేనా…?

Warangal: వరంగల్‌ను అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ 2041ని గత బీఆర్ఎస్ సర్కార్ ప్రతిపాదించింది. అందులో అతి పెద్దదైన ఏనుమాముల మార్కెట్ నుంచి హైదరాబాద్, కరీంనగర్, ములుగు, భూపాలపల్లి జిల్లాల హైవేలను కలిపేందుకు 200 ఫీట్ల బైపాస్ రోడ్డుకు ప్రతిపాదనలు చేసింది. ఏనుమాముల మార్కెట్ నుంచి ములుగు జిల్లా నుంచి వెళ్లే భూపాలపట్నం జాతీయ రహదారికి గతంలోనే 100 ఫీట్ల రోడ్డు ఉంది. దానిని డెవలప్ చేయాల్సింది పోయి, 200 ఫీట్ల బైపాస్ రోడ్డు ప్రతిపాదన పేరుతో దేశాయిపేట, పైడిపల్లి, అయ్యప్ప కాలనీ నుంచి 163 జాతీయ రహదారి ఔటర్ రింగ్ రోడ్డుకు నూతన ప్రతిపాదన చేశారు. ఈ రోడ్డును అయ్యప్ప కాలనీ దాటిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డుకు నేరుగా అనుసంధానం చేయకుండా అక్కడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువుల వెంచర్ ఉండడంతో బైపాస్ రోడ్డును వి షేప్ కర్వ్ వచ్చేలా తమకు అనుకూలంగా మార్చుకున్నారు.

మాజీ మంత్రి బంధువుల కోసం అప్పుడు నూతన రోడ్డుకు ప్రతిపాదన చేస్తే… ఇప్పుడు ఇదే 200 ఫీట్ల బైపాస్ రోడ్డు రూట్‌ను మరోసారి మార్చారు. ఈసారి ఏనుమాముల మార్కెట్ నుంచి పైడిపల్లి, కొత్తపేట క్రాస్ మీదుగా 163 జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ ప్రతిపాదనలు చేశారు. ఖమ్మం రోడ్డు నుంచి ములుగు రోడ్డుకు నర్సంపేట రహదారిని కలుపుతూ 13 కిలోమీటర్ల ఇన్నర్ రింగు రోడ్డు నిర్మాణం కోసం ఆగస్టు 2న నోటిఫికేషన్ జారీ చేశారు. ఏనుమాముల, పైడిపల్లి, ఆరేపల్లి గ్రామాల పరిధిలో భూసేకరణ కోసం సర్వే నెంబర్లను నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. నూతనంగా ప్రతిపాదించిన ఈ బైపాస్ రోడ్డు వ్యవహారంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎంట్రీ ఇచ్చారు.

Warangal: అధికారులు ప్రతిపాదించిన ఇన్నర్ రింగ్ రోడ్డును తనకు అనుకూలంగా మార్చుకునేందుకు స్కెచ్ వేశారు. దీంతో ఇన్నర్ రింగ్ రోడ్డుకు కొద్ది దూరాన ఉన్న తన భూముల పక్క నుంచి రోడ్డు వెళ్లేందుకు పావులు కదిపారు. ఇంకేముంది నోటిఫికేషన్‌లో ప్రతిపాదించిన సర్వే నెంబర్ల నుంచి కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు రూట్ మార్చి బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్ భార్య పేరుతో ఉన్న భూముల పక్క నుంచి రోడ్డు వెళ్లేలా మార్పులు చేశారు. అంతే కాకుండా 163 జాతీయ రహదారిని ఇన్నర్ రింగ్ రోడ్డు కలిసే చోట జంక్షన్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేయగా, పదేళ్లు బీఆర్ఎస్‌తో అంట కాగిన ఓ నాయకుని హాస్పిటల్ స్కూలు పక్క నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్లేలా మరి కొన్ని మార్పులు చేశారు.

ALSO READ  Donthi Madhava Reddy: సీఎం పర్యటనకు దూరంగా నర్సంపేట ఎమ్మెల్యే

తరచూ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మారుస్తూ, భూములు కోల్పోతున్న రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండా సర్వేలు నిర్వహిస్తున్నారని లీడర్లు, బడా నేతల కోసం తాము నమ్ముకున్న వ్యవసాయ భూములను ఆగం చేస్తున్నారని ఆరేపల్లి రైతులు మండిపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే, ఎన్ఎస్ఆర్ హోటల్, ఎన్ఎస్ఆర్ స్కూల్‌ల కోసం నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు కాకుండా అలైన్‌మెంట్‌ను మారుస్తుండడం వల్ల రెండు పంటలు పండే తమ పంట పొలాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఓ మాజీ మంత్రి తన స్వలాభం కోసం ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ మారిస్తే, ఇప్పుడు ఓ మాజీ ఎమ్మెల్యే, ఓ వ్యాపారి కోసం మరోసారి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను అధికారులు ఇష్టారీతిన మార్పులు చేస్తున్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు కాకుండా అలైన్మెంట్ మారిస్తే ఊరుకునేది లేదని రైతులు హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

రాసిన వారు: తెలంగాణ బ్యూరో చీఫ్‌ సుధాకర్‌

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *