Telangana

Telangana: గవర్నర్ గ్రీన్ సిగ్నల్.. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ నియామకం ఖరారు!

Telangana: తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పచ్చజెండా ఊపారు. మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్‌తో పాటు ప్రొఫెసర్ ఎం. కోదండరాం అభ్యర్థిత్వాలను గవర్నర్ ఆమోదించారు. దీంతో వీరిద్దరూ త్వరలోనే శాసనమండలిలో అడుగుపెట్టడం ఖాయమైంది.

గతేడాది ఆగస్టు 30వ తేదీనే అజారుద్దీన్, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా నియమించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించి, ఆ ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపింది. అయితే సాంకేతిక కారణాల వల్ల అప్పటి నుంచి ఈ ఫైల్ పెండింగ్‌లోనే ఉండిపోయింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గవర్నర్‌ను కలిసి, వీరి అభ్యర్థిత్వాల ప్రాధాన్యతను వివరించడంతో ఈ అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించిన గవర్నర్, వీరి నియామకానికి ఆమోదం తెలిపారు.

ఈ నిర్ణయం ముఖ్యంగా మంత్రి అజారుద్దీన్‌కు పెద్ద ఊరటనిచ్చింది. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న ఆయన, నిబంధనల ప్రకారం ఏప్రిల్ 30 లోపు ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నికవ్వాల్సి ఉంది. ఒకవేళ ఈ గడువులోగా ఎమ్మెల్సీ పదవి ఖరారు కాకపోతే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. తాజా పరిణామంతో అజారుద్దీన్ మంత్రి పదవికి ఉన్న ముప్పు తొలగిపోయింది. అలాగే తెలంగాణ ఉద్యమ నేత కోదండరాం కూడా ఇప్పుడు అధికారికంగా పెద్దల సభకు వెళ్లనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *