BRS

BRS: గతమే గుర్తింపు.. కొత్త ప్రయాణంపై పాత పార్టీ సెటైర్లు: కవిత పార్టీపై బీఆర్ఎస్ రియాక్షన్.

BRS: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన యుద్ధం మొదలైంది. తండ్రి పెట్టిన బీఆర్ఎస్ పార్టీకి పోటీగా, కుమార్తె కవిత తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త పార్టీని ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ కొత్త పార్టీ ప్రకటనపై బీఆర్ఎస్ పార్టీ తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందించింది. కవిత పెట్టిన పేరు అసలైన టీఆర్ఎస్‌ను కాపీ కొట్టడమేనని అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చింది.

బీఆర్ఎస్ చేసిన ట్వీట్‌లో ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. మనం నిత్యం చూసే కోల్గేట్ పేస్ట్, బిస్లెరీ వాటర్ బాటిల్స్‌లో డూప్లికేట్ బ్రాండ్లు ఎలా ఉంటాయో.. కవిత కొత్త పార్టీ కూడా అలాగే ఉందన్నట్లుగా పోలిక పెట్టింది. అసలైన బ్రాండ్‌ను పోలిన పేరు పెట్టుకున్నంత మాత్రాన అది అసలైనది అయిపోదని, ప్రజలు గమనిస్తున్నారనే అర్థం వచ్చేలా ఈ ఫోటోలను బీఆర్ఎస్ పోస్ట్ చేసింది.

మరోవైపు, కవిత కూడా తన తండ్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఇప్పుడు మన పాత కేసీఆర్ కాదని, ఆయన ఒక రోబోలా మారిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటనక్కల లాంటి కొందరు వ్యక్తుల చేతుల్లో ఆయన బందీ అయ్యారని, అందుకే ఉద్యమకారులను, కష్టాల్లో ఉన్న ప్రజలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ఉంటే పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసేవారని, కానీ ఇప్పుడు ఆయన కేవలం జాతీయ రాజకీయాలంటూ పంజాబ్ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.

తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై కూడా కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులను ఎప్పుడో పార్టీ నుంచి పంపించేశారని, ఇప్పుడు తనకూ అదే పరిస్థితి ఎదురైందని అన్నారు. ఒకప్పుడు అమ్మలా ఆదరించిన పార్టీలో ఇప్పుడు మమకారం లేదని, కేసీఆర్ ఒక ‘మరబొమ్మ’లా మారిపోయారని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో పుట్టిన పార్టీలో ఇప్పుడు ఉద్యమకారుల కంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత పెరిగిందని ఆమె ఆరోపించారు.

మొత్తానికి, ఒకే ఇంట్లో మొదలైన ఈ రాజకీయ పోరు ఇప్పుడు ఒరిజినల్ వర్సెస్ డూప్లికేట్ అనే స్థాయికి చేరింది. మరి కవిత పెట్టిన ఈ కొత్త టీఆర్ఎస్ ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తుంది? బీఆర్ఎస్ వేసిన సెటైర్లకు కవిత వర్గం ఎలా సమాధానం ఇస్తుంది? అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *