Visharadan maharaj: ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై ధర్మ సమాజ్ పార్టీ (డీఎస్పీ) అధినేత విశారదన్ మహారాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలో చూపించిన కొమురం భీమ్ పాత్రను ప్రస్తావిస్తూ ఆయనపై విమర్శల వర్షం కురిపించారు.
“కొమురం భీమ్ ఆనాడు బాణాలు, తుపాకులతో పోరాటం చేశాడు. కానీ ఇప్పుడు మన ఆయుధం రాజ్యాంగం” అని పేర్కొన్నారు. ఇటీవల వచ్చిన ఓ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటించారని, ఆ చిత్రంలో పేదల భూముల హక్కుల గురించి ప్రస్తావించారని గుర్తు చేశారు. అయితే, ఈ సినిమాతో పాటు చిత్ర పరిశ్రమ మొత్తం కలిసిపడి పేదల నుండి రూ. 2000 కోట్లకు పైగా కొల్లగొట్టిందని ఆయన ఆరోపించారు.
“సినిమాలో కొమురం భీమ్‌లా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ నిజ జీవితంలోనూ భూపోరాటంలో పాల్గొనాలి. నిజమైన హీరో అంటే తెర మీద కాదు, మైదానంలో చూపించాలి,” అని విసిరిపడిన ఆయన, ఎన్టీఆర్ ఈ పోరాటానికి మద్దతుగా ముందుకు రాకపోతే అవసరమైతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
తమిళనాడులో నటులు ప్రజల కోసం రోడ్డెక్కుతారని, కానీ తెలుగు సినీ నటులు మాత్రం కేవలం తెర మీద మాత్రమే హీరోలుగా మిగిలిపోతున్నారని విమర్శించారు. ఆదివాసీల భూముల కోసం పోరాటం చేస్తున్న సమయంలో, జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖులు మౌనంగా ఉండకూడదని ఆయన పిలుపునిచ్చారు.

