Virat Kohli: ముంబయిలో మురిపించిన విరాట్ ఇన్నింగ్స్ ఇవే
తొలి రెండు టెస్టుల్లో ఓడి క్లీన్ స్వీప్ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న టీమిండియా ముంబయి వాంఖెడే స్టేడియంలో 3వ టెస్టు ఆడనుంది. స్థాయికి తగినట్లు ఆడడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నకోహ్లికి ఇది అచ్చొచ్చిన స్టేడియం. ఇక్కడ విరాట్ ఆడిన ఓ మూడు కీలక ఇన్నింగ్స్ అతని ప్రతిభకు అద్దం పడతాయి. అవేంటో తెలుసుకుందామా.
Virat Kohli: ఇరు జట్లతో బంతిబంతికీ విజయం దోబూచులాడిన 2011 నాటి టెస్టులో విండీస్ జట్టు టీమిండియాతో డ్రా చేసుకుంది. అదీ విజయానికి ఒక్క పరుగు దూరంలో. డ్వేన్ బ్రేవో 166 పరుగుల అద్భుత సెంచరీ, టాప్ త్రీ బ్యాటర్ల పార్ట్నర్షిప్తో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్సులో 590 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ, సచిన్ టెండూల్కర్ 94 పరుగులతో టీమిండియా… టార్గెట్కు 108 పరుగుల సమీపానికి వచ్చింది. రెండో ఇన్నింగ్సులో ప్రగ్యాన్ ఓజా తిప్పేయడంతో విండీస్ కేవలం 134 పరుగుకే ఆలౌటైంది. భారత్ ఎదుట ఊరించే 243 పరుగుల టార్గెట్ ఉంచింది. ఛేదనలో టీమిండియా 113 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. విండీస్ పైచేయి సాధించినట్లే అనుకుంటున్న దశలో యంగ్ కోహ్లి ప్రత్యర్థులకు అడ్డుగా నిలిచాడు. 63 పరుగులు కీలక ఇన్నింగ్స్ తో టీమిండియాను విజయానికి దగ్గరగా తీసుకువచ్చాడు. 3 ఫోర్లు, 1 సిక్స్తో గడ్డు పరిస్థితి నుంచి జట్టును బయటపడేశాడు.
ఇది కూడా చదవకండి: Telugu Titans: టైటాన్స్ గెలుపుబాట
Virat Kohli: వాంఖెడే స్టేడియంలో విరాట్ బ్యాట్ నుంచి జాలువారిన ఆ 57 పరుగులు ఎంతో విలువైనవి. 2013లో సచిన్ వీడ్కోలు టెస్టులో ప్రగ్యాన్ ఓజా ఫైఫర్తో తొలి ఇన్నింగ్సులో విండీస్ ను 182 పరుగులకే చుట్టేసింది భారత్. ఛతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ సెంచరీలలతో టీమిండియా కమాండింగ్ పొజిషన్లో ఉంది. విరాట్ కోహ్లి 3 ఫోర్లు, 1 సిక్సర్ తో చక్కని హాఫ్ సెంచరీ సాధించి మిడిల్ ఓవర్లలో నిలకడ తీసుకువచ్చాడు. ఆ తర్వాత అశ్విన్, ఓజా … విండీస్ బ్యాటింగ్ ను కకావికలు చేశారు. ఆ మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్ 126 పరుగులతో గెలిచింది.
Virat Kohli: కోహ్లి కెరీర్లోనే అత్యుత్తమ టెస్టు ఇన్నింగ్సులలో 235 పరుగుల డబుల్ సెంచరీ ఒకటి. 2016లో ఇంగ్లండ్ పై జరిగిన ఆ టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు విరాట్. తొలి ఇన్నింగ్స్లులో ఇంగ్లండ్ కీటన్ జెన్నింగ్స్ సెంచరీతో 400 పరుగుల స్కోరు సాధించింది. కానీ టీమిండియా బ్యాటర్ల జోరుకు అదే మాత్రం సరిపోలేదు. మురళి విజయ్ సెంచరీతో మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. స్కోరు 2 వికెట్లకు 146 పరుగులున్న దశలో క్రీజులోకి వచ్చిన విరాట్… 25 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో డబుల్ సెంచరీ కొట్టాడు. దీంతో టీమిండియా 631 పరుగుల భారీ స్కోరు సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ ‘ఆరే’యడంతో టీమిండియా ఇన్నింగ్స్ 36 పరుగుల విజయాన్ని అందుకుంది.
కెరీర్లో గతంలో ఎన్నడూ లేనంతగా విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లి… ఈ మూడు ఇన్నింగ్స్ ల స్ఫూర్తితో వాంఖెడో స్టేడియంలో మరోసారి చెలరేగుతాడని, టీమిండియా పరువు నిలుపుతాడని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.