viral news: పీరియడ్స్ అనేది ప్రతి మహిళ జీవితంలో సహజమైన భాగం. సాధారణంగా ఇది నెలలో ఒక్కసారి వస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో హార్మోన్ల అసమతుల్యత కారణంగా కొంచెం ముందో వెనుకో రావచ్చు. పీరియడ్స్ సమయంలో మహిళలు మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతారు. అలాంటిది ప్రతీ రోజు పీరియడ్స్ వస్తే ఎలా ఉంటుంది? ఆ బాధ ఊహించడమే కష్టమైన విషయం కదా. కానీ అమెరికాలో పాపీ అనే మహిళ ఈ అరుదైన సమస్యతో గడిపిన జీవితం నిజంగా కలచివేస్తుంది.
అమెరికాకు చెందిన పాపీ అనే మహిళ గత మూడు సంవత్సరాలుగా ప్రతీ రోజూ పీరియడ్స్ సమస్యతో బాధపడుతోంది. మొదట్లో ఇది సాధారణంగా వచ్చే నెలసరే అనుకుంది. కానీ ఈ స్థితి రోజుకొకటి కాకుండా ప్రతి రోజూ జరుగుతుండటంతో ఆరోగ్య సమస్యలుగా మారింది. తరచూ తలనొప్పులు, తిమ్మిర్లు, కండరాల నొప్పులతో బాధపడుతున్న ఆమె, మొదట్లో ఈ విషయం ఎవరితోనూ పంచుకోలేదట — తను చెప్పినట్లయితే ఇతరులు తన గురించి తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటారన్న భయం కారణంగా ఆగిపోయేది.
కొంతకాలానికే సమస్య తీవ్రతరంగా మారడంతో పాపీ ధైర్యంగా వైద్యులను సంప్రదించింది. పలు పరీక్షలు, చికిత్సల తర్వాత చివరికి ఆమెకు “బైకార్నుయేట్ యుటెరస్” అనే అరుదైన గర్భాశయ నిర్మాణ లోపం ఉందని తేలింది. ఇది గర్భాశయం హృదయాకారంలో ఉండే పరిస్థితి. ఈ పరిస్థితిలో గర్భాశయం రెండు చాంబర్లుగా విడిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 5 శాతం మంది మహిళలకే ఇది వస్తుందని వైద్యులు తెలిపారు.
తాజాగా పాపీ వైద్యుల సాయంతో శస్త్రచికిత్సకు సిద్ధమవుతోంది. ఈ ఆపరేషన్ ద్వారా సమస్యకు పరిష్కారం లభించనున్నట్లు తెలిపారు. ఈ వ్యాధి కారణంగా రోజూ పీరియడ్స్ రావడం ఆమెకు ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టిందట. ముఖ్యంగా ఆమె ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ప్యాడ్స్ వంటి నెలసరి అవసరాల కోసం ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపింది.