APROOVER VISA REDDY: ఇంటి గుట్టు తెలిసినోడిని ఇంట్లోనే పెట్టుకుని జాగ్రత్త కాపాడుకోవాలి తప్ప.. ఇంట్లో నుండి గెంటేసి రోడ్డెక్కించకూడదు. రాజకోట రహస్యాలు తెలిసిన వాడిని అవమానించి రాజ్యం నుండి గెంటేస్తే ఏమవుతుంది? పక్క రాజ్యాలకు ఉప్పందించి మన కోటనే కూల్చడం గ్యారెంటీ. వైసీపీ నుండి బయటకొచ్చిన విజయసాయిరెడ్డి ప్రస్తుతం చేస్తోంది అదే.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. వైసీపీ మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, ఈ కేసులో సిట్ విచారణకు హాజరై, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, వైసీపీ నేత రాజ్ కసిరెడ్డిల పాత్రను క్లియర్ కట్‌గా బయటపెట్టారు. శుక్రవారం సిట్ ఎదుట హాజరైన విజయసాయి… లిక్కర్ పాలసీపై, అందులో జరిగిన కుంభకోణంపై సిట్ అధికారులు అడిగిన నాలుగు ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానమిచ్చినట్లు తెలిపారు.
అయితే, విచారణ అనంతరం మీడియా ముందుకొచ్చి… లిక్కర్ బిజినెస్ చేసుకుంటామని తనని బతిమాలితే.. అరబిందో ఫార్మా నుంచి తానే 100 కోట్లు అప్పు ఇప్పించానని వెల్లడించడం గమనార్హం. ఇందులో అదాన్ డిస్టలరీస్‌కు 60 కోట్లు, డి-కాక్ సంస్థకు 40 కోట్లు.. 12 శాతం వడ్డీతో ఇప్పించినట్లు పేర్కొన్నారు. ఈ సంస్థల వెనుక మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి ఉన్నట్లు పరోక్షంగా బయటపెట్టారు.
విజయసాయి తెలిపిన వివరాల ప్రకారం, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. హైదరాబాద్, తాడేపల్లిలలో ఉన్న సాయిరెడ్డి నివాసాలలోనే లిక్కర్ పాలసీపై రెండు సమావేశాలు జరిగాయి. అయితే, 2019 తర్వాత లిక్కర్ పాలసీలో ఏం జరిగిందో తనకు సమాచారం లేదన్నారు సాయిరెడ్డి. కర్త, కర్మ, క్రియ అయిన రాజ్ కసిరెడ్డే అన్నీ చూసుకున్నారన్నారు. సాయిరెడ్డి వ్యాఖ్యలతో లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డిల పాత్రపై ఆరోపణలు మరింత బలపడ్డాయి. విజయసాయి మద్యం వ్యాపారంతో తనకు సంబంధం లేదని చెప్పినప్పటికీ, ఆయన వెల్లడించిన వివరాలు వైసీపీలోని కీలక నేతలపై సిట్ దృష్టిని మరల్చాయి.
ఇది కూడా చదవండి: Vizag Greater Success: కార్పొరేటర్ల సభ్యత్వ రద్దు..కానీ మినిమం 10 నెలలు!
వైఎస్ కుటుంబంలోనూ, వైసీపీలోనూ దశాబ్దాలుగా జగన్‌కు నీడలా కొనసాగిన విజయసాయిరెడ్డి, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. పార్టీలో తన ప్రాధాన్యత తగ్గిందని, అసంతృప్తితోనే నెట్టుకొచ్చానని ఇటీవల పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. వాస్తవంగా కూడా జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో… సాయిరెడ్డిని వ్యక్తిగతంగా దూరం పెడుతున్నాడనే వార్తలు అనేక సందర్భాల్లో వచ్చాయి. ఒకానొక సందర్భంలో సీఎం కాన్వాయ్‌లో జగన్ వాహనంలో విజయసాయిరెడ్డి ఎక్కగా, కిందికి దింపేసి మరీ.. వెనుక మరో వాహనంలో రావాల్సిందిగా జగన్ ఆదేశించడం మీడియాలో హైలెట్ అయ్యింది. బయటకి కనిపించిన అవమానాలే కాదు.. పైకి కనిపించని ఎదురుదెబ్బలు సాయిరెడ్డికి చాలానే తగిలి ఉండాలి. 30 ఏళ్లు తానే సీఎం అనుకున్న జగన్ రెడ్డి కళ్లకు అధికార పొరలు కమ్మి, తనకు సాయిరెడ్డి కొండంత బలం అన్న సంగతి మర్చిపోయి ప్రవర్తించి ఉండాలి.
సాయిరెడ్డి పార్టీలో ఉన్నా, లేకున్నా.. అధికారంలో ఉండేది తానే కనుక సాయిరెడ్డి పెద్దగా చేసేది ఏమీ ఉండదని జగన్ భావించి ఉండాలి. ఇవన్నీ జరగకుండా ఉండి ఉంటే.. విజయసాయిరెడ్డి పార్టీ వీడే పరిస్థితి కానీ, స్కాముల్లో వైసీపీ నేతల్ని ఇరికించే పని కానీ సాధ్యమయ్యేవి కాదని పరిశీలకుల అభిప్రాయం. జగన్ తానేదో మోనార్క్‌నని, హిట్లర్, గఢాపీలను మించిన శక్తి మంతుడిననీ భావిస్తుంటారు కానీ.. మాయల పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నట్లు.. జగన్ బలం అంతా ఆయన్ను స్కాముల్లో నడిపించిన, కేసుల్లో తోడుగా నిలిచిన విజయసాయిరెడ్డి లాంటి వారేనని తెలుసుకోలేక పోయారన్నది అనలిస్టులు చెప్తున్న మాట.
వైసీపీతో పాటే సాయిరెడ్డి ఉద్యోగమూ ఊడింది. అయినా సరే.. సాయిరెడ్డి తన పవర్ నిలుపుకుంటూనే ఉన్నారన్న వాదన వినబడుతోంది. ఒక్కడిగానే అటు వైసీపీ సైన్యాన్ని, ఇటు సాక్షి మీడియాని ధీటుగా ఢీ కొడుతున్నారు సాయిరెడ్డి. టెక్నికల్‌గా కాకపోయినా, ఆయన ఇప్పటికే అప్రూవర్‌గా మారారన్న సంగతి అర్థమౌతోంది. తన మీదకు తెచ్చుకోకుండా, అలా అని జగన్‌ని టచ్ చేయకుండా చాలా పద్దతిగా వైసీపీని చావు దెబ్బ కొడుతున్నారు సాయిరెడ్డి. ఇప్పుడు వైసీపీ కింకర్తవ్యం ఏమిటయ్యా అని పరిశీలించి చూస్తే.. రెండే మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి సాయిరెడ్డితో రాజీ చేసుకోవడం. రెండు షర్మిలకు టీడీపీ ట్యాగ్ తగిలించినట్లే… సాయిరెడ్డికి కూడా టీడీపీ మాట్లాడిస్తోన్న చిలుకగా ముద్ర వేయడం. ప్రస్తుతం వైసీపీ చేస్తోంది కూడా అదే.