Kishan Reddy: విజయవాడ నగరంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన భాజపా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దేశ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం తీరని కృషి చేస్తోందని వివరించడమే కాదు, మోదీ పాలనలోని 11 ఏళ్ల పురోగతిని ప్రదర్శించే ప్రత్యేక గ్రంథాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.
కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, “బీజేపీ పాలన అంటే కేవలం అభివృద్ధి కాదు – అది సామాజిక న్యాయం, పారదర్శకత, సంక్షేమానికి నిలువెత్తు నిదర్శనం” అని చెప్పారు. మోదీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడ లేకపోవడం, ప్రభుత్వ విశ్వసనీయతకు నిదర్శనమని హైలైట్ చేశారు.
పేదలకు డైరెక్ట్ బెనిఫిట్ – మాదే వన్ నేషన్ వన్ ట్యాక్స్ విజన్
పేదలకు నేరుగా లబ్ధి చేరేలా డిజిటల్ వ్యవస్థలను మోదీ ప్రభుత్వం బలోపేతం చేసిందని చెప్పారు. మునుపు ఢిల్లీ నుంచి రూ.100 వస్తే రూ.85 దళారీలు దోచుకునే రోజులు పోయాయి. ఇప్పడు డబ్బు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తుందని వివరించారు. పన్నుల వ్యవస్థలో సమగ్ర మార్పులు చేస్తూ, జీఎస్టీ ద్వారా అవినీతి, మోసాలపై చెక్ వేసినట్లు చెప్పారు. 2014లో 6.91 కోట్ల మంది పన్నులు చెల్లించగా, ప్రస్తుతం అది 15.66 కోట్లకు పెరగడం ప్రభుత్వ విజయానికి నిదర్శనమన్నారు.
ఇది కూడా చదవండి: Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్లు రాలేదని ఆందోళన.. ఊరూరా నిరసనల పర్వం
రైతులకు కిసాన్ సౌగాత్ – బడ్జెట్ పెంపుతో బలమైన వ్యవసాయ రంగం
వ్యవసాయ రంగానికి భారీ ప్రాధాన్యత ఇచ్చామని వివరించిన కిషన్‌రెడ్డి, 2014లో వ్యవసాయ బడ్జెట్ రూ.25,633 కోట్లైతే, ఇప్పుడది రూ.1.33 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఇప్పటివరకు 11 కోట్ల మందికి నేరుగా డబ్బు పంపామని వివరించారు. గిట్టుబాటు ధరలు సగటున 82 శాతం పెరిగాయని చెప్పారు.
ఇన్ఫ్రా విస్తరణ – రోడ్లు, రైలు, విమానాల అభివృద్ధిలో దేశం దూసుకెళ్తోంది
భారతదేశాన్ని మౌలిక వసతుల్లో ప్రపంచస్థాయిలో నిలబెట్టే లక్ష్యంతో పనిచేస్తున్నామని, అమృత్ భారత్ పథకం కింద 1300 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. 1.46 లక్షల కిలోమీటర్ల జాతీయ రహదారులు, 7.7 లక్షల గ్రామీణ రోడ్లు నిర్మించామని వివరించారు. వందే భారత్ రైళ్లు 136 ప్రారంభించామని, ఉడాన్ పథకం ద్వారా 2014లో ఉన్న 71 విమానాశ్రయాలు ఇప్పుడు 159కి చేరాయని గర్వంగా చెప్పారు.
AIIMS, శాస్త్రీయ విజయాలు, జాతీయ గౌరవం
దేశవ్యాప్తంగా 26 AIIMS ఆసుపత్రులు ఇప్పటికే పనిచేస్తున్నాయని, మరో 15 నిర్మాణంలో ఉన్నాయన్నారు. శాస్త్రీయ రంగంలో 140 శాటిలైట్‌లు, చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరడం, బ్రహ్మోస్, బ్రహ్మాస్త్రం వంటి రక్షణ సామర్థ్యాలు భారత గౌరవాన్ని ప్రపంచానికి చాటాయని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుతో దేశ ఐక్యతకు బీజం పడ్డదని వ్యాఖ్యానించారు.
తెలంగాణపై ఆవేదన – అప్పుల్లో ముంచుకున్న రాష్ట్రమ్
తెలంగాణ గురించి మాట్లాడుతూ, 2014లో లాభాల్లో ఉన్న రాష్ట్రం, కేంద్ర మోదీ విధానాలను అనుసరించకపోవడంతో ఇప్పుడు రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.