1980ల నాటి స్టార్ హీరోయిన్లు, సొంత అక్కాచెల్లెళ్లు అయిన రాధ, అంబికల ఆస్తి గొడవ ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్‌కు చేరింది. తన గదిలోకి దూరి, సంతకాలు పెట్టి ఉన్న ఖాళీ చెక్కులను ఎత్తుకెళ్లి ఏకంగా రూ.46 కోట్లు కొట్టేయాలని చూస్తున్నారంటూ తన అక్క అంబిక, తమ్ముడు అర్జున్‌లపై రాధ చెన్నై పోలీస్ కమిషనర్‌కు కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఆరోపణలపై అంబిక మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ కీలక ఆరోపణలు చేశారు.
రాధ చెబుతున్నది ఇది..
చెన్నై పోరూరులోని ఏఆర్‌ఎస్ గార్డెన్స్ ఖర్చులు, జీతాల కోసం ఐడీబీఐ బ్యాంకుకు చెందిన కొన్ని సంతకం పెట్టిన ఖాళీ చెక్కులను తన బెడ్‌రూమ్‌లో పెట్టానని రాధ చెప్పారు. 2025 జనవరిలో ఆ ప్రాపర్టీ పేరు మార్చినప్పుడు కొత్త చెక్కు బుక్ రావడంతో, పాత చెక్కుల సంగతి మర్చిపోయారట.
సెప్టెంబర్ 17న బ్యాంకు వాళ్లు ఫోన్ చేసి.. ఆ పాత చెక్కుల్లో ఐదింటిని అంబిక పేరు మీద వేసి దాదాపు రూ.46 కోట్లు డ్రా చేయడానికి ఇచ్చారని చెప్పడంతో రాధ షాకయ్యారు. తాను అంబికకు ఎలాంటి డబ్బు ఇవ్వాల్సి లేదని, తన గదిలోకి చొరబడి దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కష్టపడి చూసుకున్న చెల్లెలే దొంగ అంటోంది.. అంబిక ఆవేదన..
రాధ తన వస్తువులను ఎంత జాగ్రత్తగా దాచుకుంటుందో అందరికీ తెలుసు. ప్రతి బ్యాగుకు నెంబర్ లాక్ వేసుకుంటుంది. అలాంటి ఆమె గదిలోకి వెళ్లి నేను చెక్కులు దొంగిలించాననడం పచ్చి అబద్ధం. చిన్నప్పుడు రాత్రింబవళ్లు కష్టపడి నా తోబుట్టువులను చూసుకున్నాను. అలాంటి నాపై దొంగతనం నింద మోపడం చాలా బాధగా ఉంది” అని వాపోయారు.
ఈ గొడవల్లో తానే నష్టపోయానని అంబిక చెప్పారు. పోరూరులోని ‘ఏఆర్‌ఎస్ గార్డెన్’ను తన సొంత సంపాదనతో, ఎంజీఆర్ ఆశీస్సులతో కట్టానని.. అలాంటి దాన్ని ‘ఆర్‌ఆర్ గార్డెన్స్’గా మార్చేసి, తనకు దక్కాల్సిన వాటా, బంగారం ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు.
రాధ మేనేజరే ఆ చెక్కులు ఇచ్చారు..
ఆస్తి పంపకాల సెటిల్‌మెంట్‌లో భాగంగానే రాధ మేనేజర్ స్వయంగా ఆ ఐదు చెక్కులను తనకు ఇచ్చారని, ఎవరో పక్కనుండి తప్పుడు సలహాలు ఇవ్వడం వల్లే రాధ ఇలా ప్రవర్తిస్తోందని అంబిక తెలిపారు. న్యాయం కోసం తనే ఇప్పటికే కోర్టుకు వెళ్లినట్లు స్పష్టం చేశారు. ఒకప్పుడు తెరపై ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ స్టార్ సిస్టర్స్.. ఇలా కోట్ల రూపాయల ఆస్తుల కోసం కేసులు, కోర్టుల దాకా వెళ్లడం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
