CPS to OPS Conversion

CPS to OPS Conversion: ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సీపీఎస్ నుంచి ఓపీఎస్‌లోకి మారేందుకు మార్గదర్శకాలు విడుదల..

CPS to OPS Conversion: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) పరిధిలోని అర్హులైన ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ నుంచి పాత పెన్షన్ విధానం (OPS)లోకి మారేందుకు ‘వన్ టైమ్ ఆఫర్’గా అవకాశం కల్పిస్తూ సమగ్ర అధికారిక మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 53 (G.O.Ms.No.53) ప్రకారం అర్హత కలిగిన ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఎవరెవరు అర్హులు?

ఈ వెసులుబాటు అందరికీ వర్తించదు. ప్రభుత్వం నిర్దేశించిన కచ్చితమైన నిబంధనలివే..

  • నోటిఫికేషన్ కట్-ఆఫ్ తేదీ: 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ (ఉద్యోగ ప్రకటన) విడుదలై, ఆ తర్వాత విధుల్లో చేరి ప్రస్తుతం సీపీఎస్ పరిధిలో కొనసాగుతున్న ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. (2004 సెప్టెంబర్ 1 తర్వాత నోటిఫికేషన్ వచ్చిన వారికి వర్తించదు).

  • సేవలో ఉన్నవారితో పాటు ఇతరులకూ అవకాశం: ప్రస్తుతం సర్వీసులో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు, వీఆర్ఎస్ (VRS) తీసుకున్న వారు, సాంకేతికంగా రాజీనామా చేసిన వారు మరియు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు (ఫ్యామిలీ పెన్షన్ కోసం) కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

‘నిధి’ (NIDHI) పోర్టల్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ..

అర్హులైన వారు కేవలం ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది:

  • పోర్టల్ ఆప్షన్: ‘NIDHI’ అప్లికేషన్‌లో ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చిన ‘CPS-OPS Conversion’ ఆప్షన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

  • లాగిన్ విధానం: సర్వీసులో ఉన్న ఉద్యోగులు తమ ప్రస్తుత నిధి లాగిన్ వివరాలతో, రిటైర్డ్ లేదా మరణించిన ఉద్యోగుల కుటుంబీకులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ కావాలి.

  • నాలుగు కీలక ధ్రువీకరణ పత్రాలు (Certified Copies) తప్పనిసరి:

    1. ఉద్యోగ నియామక నోటిఫికేషన్ లేదా రిక్రూట్‌మెంట్ ప్రకటన.

    2. రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ విడుదల చేసిన అధికారిక సెలెక్షన్ లిస్ట్.

    3. ఉద్యోగ నియామక ఉత్తర్వులు (Appointment Order).

    4. విధుల్లో చేరేందుకు అనుమతిస్తూ జారీ చేసిన చేరిక ఉత్తర్వులు (Joining Order).

  • ఉద్యోగులు తొలుత తాము నియమితులైన శాఖలోని ‘ఇనిషియల్ అపాయింటింగ్ అథారిటీ’ (IAA)ని సంప్రదించి ఈ 4 పత్రాల సర్టిఫైడ్ కాపీలను పొందాలి. దరఖాస్తు అందిన 15 పనిదినాల్లో అధికారులు వీటిని జారీ చేయాల్సి ఉంటుంది.

వెరిఫికేషన్ & ఆమోద ప్రక్రియ..

  • ఉద్యోగులు ధ్రువీకరించిన పత్రాలను నిధి పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి, సర్వీసులో ఉన్నవారు ప్రస్తుత DDOకు, రిటైర్డ్ ఉద్యోగులు తాము చివరిగా పనిచేసిన ఆఫీస్ DDOకు దరఖాస్తు సమర్పించాలి.

  • డీడీఓలు ఈ పత్రాలను ఇనిషియల్ అపాయింటింగ్ అథారిటీకి పంపగా, వారు 7 రోజుల్లో నిర్ధారించాలి. అనంతరం డీడీఓలు 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి ప్రతిపాదనలను PAO లేదా DTAకు పంపుతారు. చివరగా కాంపిటెంట్ అథారిటీ అర్హతలు పరిశీలించి ఓపీఎస్ మార్పునకు తుది ఉత్తర్వులు ఇస్తుంది.

నిధుల సర్దుబాటు – నిబంధనలు..

  • జీపీఎఫ్ (GPF) ఖాతా కేటాయింపు: ఓపీఎస్‌లోకి మారిన వారికి ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980 వర్తిస్తాయి. వీరికి కొత్తగా జీపీఎఫ్ ఖాతా తెరుస్తారు.

  • ఉద్యోగి వాటా: ఇప్పటివరకు సీపీఎస్‌లో జమ అయిన ఉద్యోగి వాటా మొత్తాన్ని, దానిపై లెక్కించిన వడ్డీతో కలిపి కొత్తగా ప్రారంభించే జీపీఎఫ్ ఖాతాకు జమ చేస్తారు.

  • ప్రభుత్వ వాటా: ప్రభుత్వ వాటా మరియు పెట్టుబడుల ద్వారా వచ్చిన రాబడిని ప్రభుత్వ నిర్దేశిత ఖాతాకు మళ్లిస్తారు.

  • నగదు రూపంలో ఇవ్వరు: మొత్తం సీపీఎస్ కార్పస్‌ను ఉద్యోగులకు నేరుగా నగదు రూపంలో పొందే హక్కు ఉండదు.

  • రిటైర్డ్ ఉద్యోగుల విధానం: ఇప్పటికే రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందిన రిటైర్డ్ ఉద్యోగులు.. ప్రభుత్వం చెల్లించిన వాటా, దాని రాబడిని తిరిగి ప్రభుత్వానికి చెల్లించిన తర్వాతే ఓపీఎస్ అమలు చేస్తారు. ప్రయోజనాలు పొందని వారికి ప్రభుత్వ వాటాను మినహాయించుకుని మిగిలిన మొత్తం చెల్లిస్తారు.

దరఖాస్తుకు తుది గడువు – ముఖ్య గమనిక..

అర్హులైన ఉద్యోగులు డిసెంబర్ 31, 2026 లోగా నిధి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇది కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే ఇచ్చే ‘వన్ టైమ్ ఆప్షన్’. ఒక్కసారి సీపీఎస్ నుంచి ఓపీఎస్‌లోకి మారిన తర్వాత తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ సీపీఎస్ విధానంలోకి రావడానికి అనుమతించరు కాబట్టి ఉద్యోగులు నిబంధనలు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *