Vemulawada: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి (రాజన్న) ఆలయంలో దర్శనాలకు సంబంధించిన అధికారుల నిర్ణయం భక్తులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో ఇప్పటికే దర్శనాలను నిలిపివేసిన అధికారులు.. తాజాగా ఆలయంలోకి భక్తులు ప్రవేశించకుండా ప్రధాన ద్వారం వద్ద ఇనుప రేకులను అడ్డుగా అమర్చారు.
ముందస్తు సమాచారం లేకుండా మూసివేత
బుధవారం తెల్లవారుజామున ఆలయ ప్రధాన ద్వారాన్ని కూడా ఇనుప రేకులతో మూసివేశారు. దేవాదాయ కమిషనర్ లేదా ఆలయ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా ఆలయాన్ని మూసివేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయంలోకి కేవలం స్వామి వారి చతుష్కాల పూజలకు అర్చకులను మాత్రమే అనుమతిస్తున్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి నేపథ్యంలో భీమేశ్వరాలయంలోనే భక్తులకు దర్శనాలతో పాటు కోడె మొక్కులు, ఇతర ఆర్జిత సేవలను నిర్వహిస్తున్నారు.
నిరాశలో కార్తీక మాసం భక్తులు
ప్రస్తుతం పవిత్రమైన కార్తీక మాసం కావడంతో రాజన్న దర్శనం కోసం వేములవాడకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే, పునర్నిర్మాణం పేరిట ఆలయ ప్రధాన ద్వారం మూసివేయడంతో వచ్చిన భక్తులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.
ఇది కూడా చదవండి: Dharmendra: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నటుడు ధర్మేంద్ర!
భక్తులు రాజన్న ఆలయం ముందు ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్లకే మొక్కి వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. దీంతో రాజన్న ఆలయం భక్తులు లేక వెలవెలబోతున్నది.
అభివృద్ధి పనులు వేగవంతం
అభివృద్ధి పనుల్లో భాగంగా సుమారు నెల రోజుల నుంచి ఆలయ పరిసరాలలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దక్షిణ, ఉత్తర భాగాలలో ప్రాకారం, పడమర వైపు ఉన్న నైవేద్య శాల, ఆలయ ఈవో కార్యాలయం వంటివి ఇప్పటికే తొలగించారు. ఆలయం చుట్టూ పలు ప్రాంతాల్లో భక్తులు లోనికి రాకుండా ఇనుప రేకులు అమర్చి పనులను వేగవంతం చేస్తున్నారు.
భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని, కనీసం ప్రధాన ద్వారం వద్ద నుంచైనా రాజన్న దర్శనానికి అనుమతించాలని భక్తులు అధికారులను కోరుతున్నారు.

