Vande Mataram: భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తిని రగిలించిన చారిత్రక గేయం ‘వందేమాతరం’ నేటితో (నవంబర్ 7, 2025) 150 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది.
ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో నేడు ఈ కార్యక్రమాలు ప్రారంభం మొదలైది. ప్రధాని నరేంద్ర మోదీ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్మారక స్టాంపు (Commemorative Stamp) మరియు నాణెం (Coin) లను కూడా ప్రధాని విడుదల చేయనున్నారు. వేడుకల్లో భాగంగా, నేడు ఉదయం 9:50 గంటలకు దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో అన్ని వర్గాల ప్రజలు సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సీఎస్ ఆదేశాలు
‘వందేమాతరం’ 150 ఏళ్ల వేడుకల్లో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా పాటించాల్సిన అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, స్థానిక సంస్థలు, అనుబంధ, గుర్తింపు పొందిన సంస్థలన్నింటిలోనూ శుక్రవారం ఉదయం సామూహికంగా ‘వందేమాతరం’ ఆలపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Shubman Gill: గిల్‌ను టీ20 జట్టులో ఉంచాల్సిందే!
వందేమాతరం: ఒక చారిత్రక గీతం
‘వందేమాతరం’ గీతానికి జాతీయ గీతంతో సమానమైన గౌరవం ఉంది. ఈ దేశభక్తి గీతాన్ని ప్రఖ్యాత బెంగాలీ రచయిత బంకించంద్ర ఛటర్జీ నవంబర్ 7, 1875 న రచించారు. ఈ గేయం తొలిసారిగా ఛటర్జీ రాసిన సంచలనాత్మక బెంగాలీ నవల ‘ఆనంద్ మఠ్’ లో ప్రచురించబడింది. ఈ గీతం స్వదేశీ ఉద్యమ సమయంలో లక్షలాది మంది స్వాతంత్య్ర యోధులకు శక్తివంతమైన నినాదంగా, స్ఫూర్తిదాయక గీతంగా మారింది. దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిన ఈ గీతం 150వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం భారతీయులందరికీ గర్వకారణం.

