Uttarakhand: ఉత్తర భారతంలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను క్లౌడ్ బరస్ట్ వణికించింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు కురిసిన కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు రెండు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఇరురాష్ట్రాల్లోనూ వంతెనలు, రహదారులు కొట్టుకుపోయి రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.
హిమాచల్ ప్రదేశ్‌లో తీవ్ర ప్రభావం
హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ జిల్లా అత్యంత తీవ్ర నష్టాన్ని చవిచూసింది. నిహ్రీ ప్రాంతంలో కొండచరియలు విరిగి ఒక ఇంటిపై పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారని జిల్లా ఎస్పీ సాక్షి వర్మ తెలిపారు. మరో ఇద్దరిని సహాయక బృందాలు కాపాడగలిగాయి.
ధర్మపూర్ పట్టణంలోని బస్ స్టాండ్ వరద నీటిలో మునిగిపోయింది.20కి పైగా ప్రభుత్వ బస్సులు, వాహనాలు కొట్టుకుపోయాయి.వర్క్‌షాప్‌లు, పంప్ హౌస్‌లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి.
ఉప ముఖ్యమంత్రి ముఖేశ్ అగ్నిహోత్రి ఫేస్‌బుక్‌లో పరిస్థితిని వివరించారు. సిమ్లాలోనూ కొండచరియలు విరిగిపడటంతో ప్రధాన రహదారులు మూసుకుపోయాయి.
ఉత్తరాఖండ్‌లో విధ్వంసం
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.సహస్రధార, రాయ్‌పూర్, మాల్దేవతా ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి.
సహస్రధార నది ఉప్పొంగడంతో హోటళ్లు, దుకాణాలు వరద నీటిలో మునిగాయి.మాల్దేవతా ప్రాంతంలో 100 మీటర్ల పొడవైన రహదారి వరదలో కొట్టుకుపోయింది.
దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రభుత్వాల స్పందన
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి మంగళవారం ఉదయం ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆయన అధికారులతో సమీక్షించి, సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని తెలిపారు. రహదారులను పునరుద్ధరించే పనులు ముమ్మరం చేయబడ్డాయి. సహస్రధార నదిలో చిక్కుకున్న ఐదుగురిని ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు రక్షించారు.
కేంద్రం హామీ
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి ధామితో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్ని విధాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇరురాష్ట్రాల్లోనూ సహాయక బృదాలు నిరంతరాయంగా పని చేస్తున్నాయి.