Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర జల వనరుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కీలక సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు, నిధులు సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వేదికగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమై రాష్ట్రంలోని జల వివాదాలు, ప్రాజెక్టుల పురోగతిపై సమగ్ర చర్చ జరిపారు. కీలక అంశాలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ఉత్తమ్.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌కు అందజేసిన వినతిపత్రంలో పలు కీలక డిమాండ్లు, పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలను స్పష్టంగా వివరించారు.
బనకచర్ల పేరు మార్పుపై అభ్యంతరం:
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకిస్తున్న విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ప్రాజెక్టు పేరు మార్చి మళ్లీ అనుమతుల కోసం ప్రయత్నిస్తోందని, దీనిని వెంటనే నిలువరించాలని గట్టిగా కోరారు. పోలవరం నుంచి వరద జలాలను తరలించే ఏపీ ప్రయత్నాలను కూడా కేంద్రమే అడ్డుకోవాలన్నారు.
ఆల్మట్టి డ్యాం ఎత్తుపై కర్ణాటక యత్నాలు:
ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచొద్దని గతంలో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అయినా కూడా, సుప్రీం స్టేను లెక్క చేయకుండా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు ప్రయత్నిస్తోందని, దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: ED Entry in IBOMMA Case: భారీగా మనీలాండరింగ్ జరిగింది..! ఐ బొమ్మ రవి కేసులో ఈడీ ఎంట్రీ
కీలక ప్రాజెక్టులకు నిధులు, అనుమతులు:
ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ వంటి భారీ ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం, నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించాలని కోరారు.
సమ్మక్క-సాగర్, నీటి కేటాయింపులు:
సమ్మక్క-సాగర్ ప్రాజెక్టుపై లేవనెత్తిన సాంకేతిక అభ్యంతరాలను ఇప్పటికే నివృత్తి చేశామని, వెంటనే ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 90 టీఎంసీల నీటి కేటాయింపులకు గాను, మొదటి దశలో మైనర్ ఇరిగేషన్ కింద పొదుపు చేసిన 45 టీఎంసీలకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
మొత్తం మీద, కృష్ణా గోదావరి నది జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న నీటి హక్కులను కాపాడాలని, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

