Uttam Kumar Reddy: రేషన్ కార్డుల జారీపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందజేస్తామని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల ప్రక్రియ ఎప్పటికప్పుడు కొనసాగుతుందని తెలిపారు.
ఆహార భద్రత చట్టం తెచ్చింది కాంగ్రెస్
ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మంత్రి అన్నారు. ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నప్పటికీ, 2 కోట్ల 80 లక్షల మంది లబ్ధిదారులు కార్డుల ద్వారా ప్రయోజనం పొందుతున్నారని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ తమ పదేళ్ల పాలనలో కేవలం 60 వేల రేషన్ కార్డులు మాత్రమే అందజేశారని విమర్శించారు.
నూతన రేషన్ ప్రక్రియ
నూతన, పాత రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయ్యాక మరో 40 లక్షల మంది లబ్ధిదారులకు రేషన్ అందించబడుతుందని మంత్రి వెల్లడించారు. రేషన్ కార్డులు పొందిన వారికి వ్యక్తిగతంగా 6 కిలోల సన్నబియ్యం కూడా అందజేస్తామని చెప్పారు. సన్నబియ్యం పంపిణీ వల్ల ప్రభుత్వంపై 11 వేల కోట్ల రూపాయల భారం పడుతుందని తెలిపారు. ప్రజావాణి, గ్రామ సభల ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. లిస్ట్‌లో పేరు లేని వారు ప్రజావాణి లేదా గ్రామ సభలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
హరీష్ రావుపై విమర్శలు
హరీష్ రావు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ మంత్రి మండిపడ్డారు. “బీఆర్ఎస్ మమ్మల్ని అప్పుడు అడ్డుకుంది, ఇప్పుడు మేము చేస్తున్న పథకాలకు ఆటంకం కలిగిస్తోంది,” అని ధ్వజమెత్తారు. కృష్ణా ట్రిబ్యునల్ అంశంపై కేసీఆర్ మరియు హరీష్ రావు లిఖిత పూర్వక సంతకాలు పెట్టారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ తగిన చర్యలు తీసుకోలేదని, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలిపారు. 298 టీఎంసీలకు సంబంధించి సంతకాలు ఉన్న డాక్యుమెంట్లు ఉన్నాయని స్పష్టంచేశారు.