Ram Mohan Naidu: శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి ఇంట్లో మంగళవారం ఆనందం వెల్లివిరిసింది. ఆయన సతీమణి శ్రావ్య మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఫోర్టిస్ ప్రసూతి ఆసుపత్రిలో ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో కింజరాపు కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగితేలుతున్నారు. దివంగత నేత ఎర్రన్నాయుడు గారే మళ్లీ పుట్టారంటూ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబంలో ఆనందం
రామ్మోహన్ నాయుడు, శ్రావ్య దంపతులకు ఇది రెండవ సంతానం. వీరికి మొదటి సంతానంగా 2021లో మిహిర అన్వి శివంకృతి అనే కుమార్తె జన్మించింది. ఇప్పుడు మగబిడ్డ పుట్టడంతో కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
రామ్మోహన్ నాయుడుకి తన తండ్రి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు అంటే చాలా ఇష్టం. 2012లో రోడ్డు ప్రమాదంలో ఎర్రన్నాయుడు మరణించిన తర్వాత, ఆయన రాజకీయ వారసుడిగా రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా అరంగేట్రం చేశారు. ఇప్పటివరకు వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ప్రస్తుతం, ఆయన అతి చిన్న వయసులోనే కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా పదవిని చేపట్టి దేశానికి సేవ చేస్తున్నారు.
ఈ శుభవార్తతో కింజరాపు కుటుంబంతో పాటు, శ్రావ్య తండ్రి, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కుటుంబం కూడా సంతోషంలో పాలుపంచుకుంటుంది. ఈ పుత్రోత్సాహంతో రామ్మోహన్ నాయుడు గారు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.