Maoist Surrender

Maoist Surrender: మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ.. పోలీసుల ఎదుట అగ్రనేత నరహరి దంపతుల లొంగుబాటు

Maoist Surrender: భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత 45 ఏళ్లుగా అడవుల్లో ఉంటూ, పార్టీలో అత్యంత కీలక పాత్ర పోషించిన కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ తన భార్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేదరి ధనమ్మ అలియాస్ లతతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మే 12న రహస్యంగా లొంగిపోయిన ఈ దంపతులను మంగళవారం హైదరాబాద్‌లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పునరావాస నియమాల ప్రకారం నరహరికి రూ. 25 లక్షలు, ధనమ్మకు రూ. 20 లక్షల చొప్పున మొత్తం రూ. 45 లక్షల రివార్డు చెక్కులను డీజీపీ అందజేశారు.

హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన నరహరి 1982లో విద్యార్థి దశలోనే విప్లవ సిద్ధాంతాలకు ఆకర్షితులై అజ్ఞాతంలోకి వెళ్లారు. పార్టీలో అత్యంత ప్రమాదకరమైన టెక్నికల్ వింగ్ బాధ్యతలు చూస్తూ.. ఆయుధాల తయారీ, రాకెట్ లాంచర్లు, బాంబులు అమర్చడంలో ఆయన నిపుణుడిగా పేరు తెచ్చుకున్నారు.

ఈ సందర్భంగా పసునూరి నరహరి మాట్లాడుతూ, తాము ప్రజా జీవితంలోకి అడుగుపెట్టేందుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి, డీజీపీ సీవీ ఆనంద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మావోయిస్టుల సాయుధ పోరాటం చాలా కష్టంగా మారిందని, అందుకే తాము అడవుల నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతిని కూడా అజ్ఞాతాన్ని వీడి సాధారణ జీవితంలోకి రావాలని నరహరి కోరారు.

తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఉనికి క్రమంగా తగ్గిపోతోందని, ప్రస్తుతం దేశం మొత్తం మీద కేవలం 47 మంది అగ్రనేతలు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నట్లు చెప్పారు. వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో అడవుల్లో ఉన్న వారు లొంగిపోతే ప్రభుత్వం తరఫున అత్యుత్తమ వైద్య సదుపాయాలు, మెరుగైన పునరావాసం కల్పించి గౌరవంగా బతికేలా పూర్తి భరోసా ఇస్తామని డీజీపీ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *