Professor Nageshwar

Professor Nageshwar: పోలీస్ నోటీసుల వార్తలపై ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ క్లారిటీ!

Professor Nageshwar: రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ తాజాగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసత్య ప్రచారంపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నాగేశ్వర్.. ఆంధ్రప్రదేశ్ పోలీసులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

ఇటీవల ఒక టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ సంచలనానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే, వివాదం పెద్దది కావడంతో తాను చేసిన ఆ వ్యాఖ్యలను ఇప్పటికే వెనక్కి తీసుకున్నట్లు నాగేశ్వర్ ఈ సందర్భంగా మీడియాకు వివరించారు.

ఈ కేసుల నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు తెలంగాణకు వచ్చారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. నాగేశ్వర్ అరెస్ట్ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అదంతా కేవలం తప్పుడు ప్రచారమేనని ఏపీ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *