Congress

Congress: సీఎం మార్పుపై నో సస్పెన్స్.. కేవలం రాజ్యసభ సీట్లపైనే చర్చ

Congress: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు గురించి గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. రాష్ట్రంలో సీఎం మార్పు అనేది అస్సలు లేదని తేల్చి చెప్పింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో హఠాత్తుగా భేటీ కావడంతో నాయకత్వ మార్పు ఖాయమంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, ఈ వార్తలన్నీ కేవలం పుకార్లేనని, వారి మధ్య కేవలం రాజ్యసభ ఎన్నికల గురించే చర్చ జరిగిందని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసింది.

దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన మంగళవారం ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ భేటీకి సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్లతో పాటు రాహుల్ గాంధీ, కర్ణాటక కాంగ్రెస్ ఇన్‌చార్జ్ రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కర్ణాటక రాజకీయాలపై తీవ్రంగా చర్చించారు. సీఎం మార్పు కోసమే ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.

ఈ భేటీ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడి పూర్తి క్లారిటీ ఇచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రిని మార్చే ఉద్దేశం పార్టీకి లేదని ఆయన స్పష్టం చేశారు. సిద్ధరామయ్యను పదవి నుంచి తొలగిస్తున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై మాత్రమే తాము చర్చించామని ఆయన వివరించారు.

నిజానికి 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ‘పవర్ షేరింగ్’ ఒప్పందంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఐదేళ్ల పాలనలో మొదటి రెండున్నరేళ్లు సిద్ధరామయ్య, ఆ తర్వాతి రెండున్నరేళ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారని అప్పట్లో ప్రచారం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తి కావడంతో.. ఒప్పందం ప్రకారం తమ నేత డీకే శివకుమార్‌కు సీఎం సీటు ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. సిద్ధరామయ్యను దిల్లీ రాజకీయాల్లోకి పంపి, డీకేకు రాష్ట్ర బాధ్యతలు ఇస్తారని అనుకున్నప్పటికీ, అధిష్టానం ఇచ్చిన తాజా క్లారిటీతో ఈ వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *