TTD EO: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 8వ తేదీ సాయంత్రం శ్రీ మలయప్ప స్వామి విశేషమైన గరుడ వాహనంపై సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విహరిస్తారని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆదివారం సాయంత్రం ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి ఈవో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ….దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉండే విధంగా చర్యలు చేపట్టామని,గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవిందనిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా దర్శనం కల్పిస్తామని తెలిపారు.
