Jalgaon Train Accident: మహారాష్ట్రలో జల్గావ్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన పుష్పక్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం దేశాన్ని కుదిపేసింది. రైలులో మంటలు రావడంతో ప్రయాణీకులు కిందకు దూకదాంతో ప్రమాదం జరిగింది. వారు పక్కనే ఉన్న ట్రాక్ పైకి దూకడంతో అదే సమయంలో అటువైపు వెళుతున్న ఇంకో రైలు కింద పడిపోయి మరణించారని మొదట వార్తలు వచ్చాయి. అయితే, పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు రావడం అనేది అబద్ధం అని తేలింది.
పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై అధికారుల పాథమిక దర్యాప్తులో విస్తుకొలిపే విషయాలు తెలిశాయి. అధికారులు చెబుతున్నదాని ప్రకారం సంబంధిత మార్గంలో రైల్వే పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఆ మార్గంలో నడుస్తున్న పుష్పక్ రైలు వేగాన్ని తగ్గించేందుకు బ్రేక్ వేశారు. ఆ సమయంలో పట్టాలకు.. రైలు చక్రాలకు మధ్య రాపిడి జరిగి నిప్పురవ్వలు ఎగిశాయి. దానిని చూసిన ప్రయాణీకుడు ఒకరు మంటలు వస్తున్నాయి అంటూ అరిచి.. రైలును ఆపడానికి చైన్ లాగాడు. దీంతో రైలు ఆగిపోవడం.. మంటలు వస్తున్నాయన్న భయంతో ప్రయాణీకులు రైలు నుంచి పక్కకు దూకడం జరిగింది. సరిగ్గా అదే సమయంలో రెండో ట్రాక్ పై బెంగళూరు నుంచి ఢిల్లీ వెళుతున్న కర్ణాటక ఎక్స్ ప్రెస్ వచ్చింది. పట్టాలపై దూకిన వారు తప్పించుకునే అవకాశం లేకపోవడంతో రైలు కింద పడిపోయారు.
ఇది కూడా చదవండి:HDFC Bank Q3 2025 Results: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభం రూ.16735 కోట్లు
Jalgaon Train Accident: రైలులో అగ్ని ప్రమాదం జరిగిందనే ప్రచారం సరైనది కాదని అధికారులు స్పష్టం చేశారు. కేవలం వదంతుల నుంచి పుట్టిన భయంతో ప్రయాణీకులు తొందరపడడంతో అనుకోకుండా ఈ విషాద సంఘటన జరిగిందని వారు చెప్పారు.
ఈ సంఘటన తరువాత పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద స్థలం నుండి 15 నిమిషాల్లో బయలుదేరింది. అదేవిధంగా కర్ణాటక ఎక్స్‌ప్రెస్ కూడా 20 నిమిషాల తర్వాత బయలుదేరింది.
ఈ ప్రమాదంపై మంత్రి గిరీష్ మహాజన్ మాట్లాడుతూ.. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఇందులో 12 మంది చనిపోయారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించారు. వారంతా డేంజర్ ఫేజ్‌ను దాటారు’’ అని చెప్పారు.