Road Accident: శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై శుక్రవారం తెల్లవారుజామున అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఎగ్జిట్ నంబర్ 16 వద్ద ఆగి ఉన్న ఒక లారీని వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా ఢీకొట్టింది. ఈ భయంకర సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు మరియు ఇద్దరు చిన్న పిల్లలు ఉండటం అందరినీ కలచివేస్తోంది.
ప్రమాద సమయంలో కారులో మొత్తం ఏడుగురు ఉన్నట్లు సమాచారం. పెద్దగోల్కొండ నుండి శంషాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అతివేగం కారణంగా కారు నియంత్రణ కోల్పోయి, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. కారు నంబర్ TS 23 F 2298 గా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో మహిళ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. స్థానికులు మరియు పోలీసులు వెంటనే స్పందించి ఆమెను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
