Kurnool

Kurnool: కర్నూలు దగ్గర ఘోర అగ్నిప్రమాదం: పూర్తిగా దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

Kurnool: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి, 20 మందికి పైగా ప్రయాణికులు సజీవదహనమైనట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వీ కావేరీ ట్రావెల్స్కు చెందిన ఈ బస్సు (నెంబర్ DD 01 N 9490), కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో ఒక బైక్‌ను ఢీకొట్టింది. బైక్ బస్సు కిందకు వెళ్లి పేలడంతో, తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బస్సు ముందు భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత బస్సు మొత్తం వ్యాపించాయి.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 నుంచి 44 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగగానే అప్రమత్తమైన 12 మంది ప్రయాణికులు బస్సులోని ఎమర్జెన్సీ డోర్, కిటికీల అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. మిగతావారు గాఢ నిద్రలో ఉండటం వల్ల బయటకు రాలేకపోయారని సమాచారం.

స్థానికులు వెంటనే పొగను గమనించి, బస్సు అద్దాలు పగలగొట్టి కొంతమందిని బయటకు తీయడానికి ప్రయత్నించారు. అయితే, మంటలు వేగంగా వ్యాపించడంతో ఎక్కువ మందిని రక్షించలేకపోయారు. ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, అగ్నిప్రమాదం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. “బైక్‌ను ఢీకొట్టగానే డ్రైవర్, స్పేర్ డ్రైవర్ అప్రమత్తమై మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ మంటల తీవ్రత ఈ స్థాయిలో ఉంటుందని వారు అంచనా వేయలేకపోయారు. కొంతమంది ఎమర్జెన్సీ డోర్ల ద్వారా బయటకు వచ్చారు” అని తెలిపారు. బస్సు ఎక్స్‌ట్రా డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ (FSL) టీమ్ ఘటనాస్థలానికి చేరుకుంది.

Kurnool

ప్రభుత్వ స్పందన
ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అక్కడి నుంచే జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు తక్షణ, మెరుగైన వైద్య సహాయం అందించాలని, అవసరమైతే వారిని హైదరాబాద్‌కు తరలించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు నుండి బయటపడిన కొంతమంది ప్రయాణికుల పేర్లు: నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, అకీరా, రమేష్, జయసూర్య, హారిక, సుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి.

 

 

 

 

  • Beta

Beta feature

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *