Shetti Mounika: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెంలో ఆదివారం రాత్రి బతుకమ్మ సంబరాల మధ్య ఘోర విషాదం చోటుచేసుకుంది. పల్లె స్త్రీలు, పిల్లలతో కలిసి సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్న శెట్టి మౌనిక (36) ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది.
ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి మౌనిక పూలు పేర్చుకుని ఊరి ఆలయ ప్రాంగణానికి వెళ్లారు. అక్కడ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ, ఇతర మహిళలతో కలిసి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు, స్థానికులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినా, మార్గమధ్యంలోనే మౌనిక చివరి శ్వాస విడిచారు.
ఇది కూడా చదవండి: GST 2.0: జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. బైక్, కార్లపై భారీగా తగ్గింపు.. ఫుల్ లిస్ట్ మీకోసం..
ఈ ఘటనతో ఆనందంలో మునిగిపోయిన గ్రామం క్షణాల్లోనే విషాద ఛాయల్లో మునిగిపోయింది. ఉదయం నుంచే భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి పూలు తెంపి, సాయంత్రం సంతోషంగా పండుగలో పాల్గొన్న మౌనిక ఆకస్మిక మృతి గ్రామాన్ని కన్నీటిలో ముంచెత్తింది. పిల్లలు “అమ్మా… లే…” అంటూ రోదించగా, అక్కడున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. గ్రామ గుడి వద్ద మార్మోగిన పాటలు ఆగిపోయి, వాటి స్థానంలో విలపనలు నిండిపోయాయి.
సైలెంట్ హార్ట్ అటాక్ ప్రమాదకరం
ఈ ఘటనపై వైద్యులు హెచ్చరిస్తూ, హార్ట్ అటాక్ ఎప్పుడూ లక్షణాలతోనే వస్తుందని అనుకోవద్దని చెబుతున్నారు. సాధారణంగా ఛాతినొప్పి, చెమటలు, శ్వాస ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయి. అయితే సైలెంట్ హార్ట్ అటాక్ అనే రకం ఎటువంటి లక్షణాలు లేకుండానే వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమనులు కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకుపోవడం (ప్లాక్) వలన అడ్డుకుపోతాయి. ఈ ప్లాక్ విరిగిపోతే రక్తం గడ్డకట్టి రక్తప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకుంటుంది. ఫలితంగా అకస్మాత్తుగా గుండెపోటు సంభవిస్తుంది. అందుకే క్రమం తప్పకుండా ఆరోగ్యపరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
గ్రామానికి మరువలేని జ్ఞాపకం
బతుకమ్మ ఆనందం నడుమ జరిగిన ఈ దుర్ఘటన ఎంచగూడెం గ్రామానికి మరువలేని గాయం మిగిల్చింది. పూలతో పండుగ చేసుకోవడానికి వెళ్లిన మౌనిక చివరికి శవంగా మారిపోవడం గ్రామస్తులను కన్నీరుమున్నీరయ్యేలా చేసింది. గ్రామ గుడి ప్రాంగణంలో బతుకమ్మ పాటల స్థానంలో మౌనిక జ్ఞాపకం, ఆమె పిల్లల రోదనలు మాత్రమే మిగిలాయి.