Mahesh Kumar Goud: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్ఫూర్తితో నిర్వహించిన సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆదివారం చార్మినార్ వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా జరిగిన సభలో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
ఈ సందర్బంగా ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌ను ఆకాశానికెత్తారు. “సల్మాన్ ఖుర్షీద్ ఒక మచ్చలేని వ్యక్తి, ఆయనే మనకు మార్గదర్శి” అంటూ కొనియాడారు. రాజీవ్ గాంధీ సద్భావన యాత్రను పురస్కరించుకుని ఏటా ఇచ్చే సద్భావన కమిటీ అవార్డును ఈ ఏడాది గొప్ప వ్యక్తి సల్మాన్ ఖుర్షీద్‌కు ఇవ్వడం ఎంతో శుభ పరిణామం అని గౌడ్ పేర్కొన్నారు.
దేశ ఐక్యత కోసం రాజీవ్ గాంధీ యాత్ర
దేశ ఐక్యతను పెంపొందించడం కోసం రాజీవ్ గాంధీ 1990, అక్టోబర్ 9న చార్మినార్ నుంచి సికింద్రాబాద్ వరకు సద్భావన యాత్ర చేశారని మహేశ్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజీవ్ గాంధీ ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేందుకు రాహుల్ గాంధీ నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Kishan Reddy: ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా నక్సలైట్లు.. లొంగిపోవడం కేంద్ర ప్రభుత్వ విజయం
తెలంగాణలో పేదల సంక్షేమమే ధ్యేయం
తెలంగాణలో నడుస్తున్న ప్రజా పాలన తీరును మహేశ్ కుమార్ గౌడ్ వివరించారు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా, తమ పాలనలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా పరుగులు తీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. “తెలంగాణలో పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన నడుస్తోంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి” అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీహార్‌లోని సంక్షేమ పథకాలను విమర్శిస్తూ.. అక్కడ కేవలం పది కిలోల దొడ్డు బియ్యం తప్ప మరే సంక్షేమం లేదని ఎద్దేవా చేశారు.
కాగా, సభకు ముందు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, స్థానిక నాయకులతో కలిసి చారిత్రక చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీలు కొప్పుల ప్రవీణ్ కుమార్, అల్లం భాస్కర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.