Tirupati: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారధి, ఆనం రామనారాయణరెడ్డి పరామర్శించారు. స్విమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు.
Tirupati: తొక్కిసలాట ఘటన ప్రమాదమా? లేక కుట్ర? అనే కోణంలో విచారణ జరుపుతున్న హోంశాఖ మంత్రి అనిత తెలిపారు. ఎవరి వైఫల్యం ఉన్నదనే విషయంపై సీసీ కెమెరాల ఆధారంగా విచారణ కొనసాతుందని తెలిపారు. బాధ్యులు ఎంతటి వారైనా కఠిన శిక్షలు అమలు చేస్తామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
Tirupati: తొందరపాటు చర్య, లేక ప్రమాదమా? అనేది విచారణలో తేలుతుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపుతామని, అక్కడి అంత్యక్రియలకు స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తొక్కిసలాట ఘటనపై కేసు
Tirupati: తొక్కిసలాట ఘటనపై అక్కడ ఇన్‌చార్జిగా ఉన్న నారాయణవనం తహసీల్దార్ జయరామయ్య ఈస్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి 8.20 గంటలకు క్యూలైన్‌లో ఉన్న ఓ మహిళ శ్వాసతో ఇబ్బందులు పడిందని, ఆమెను రక్షించే క్రమంలో అక్కడున్న భద్రతా సిబ్బంది గేటు తెరుస్తుండగా, క్యూలో ఉన్న భక్తులు ఒక్కసారిగా తోసుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగిందని తహసీల్దార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.