Tirumala: కల్తీ నెయ్యి కేసు: వైవీకి సిట్ నోటీసులు

Tirumala: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్‌, వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వైవీ సుబ్బారెడ్డికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలోనే శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఆరోపణలతో రాష్ట్రంలో రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సిట్‌ దర్యాప్తు ప్రారంభించి, ఇప్పుడు దాన్ని వేగవంతం చేసింది.

ఇప్పటికే ఈ కేసులో భాగంగా అధికారులు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అలాగే కొంతమంది అధికారులు, కాంట్రాక్టర్లు, సరఫరాదారులను విచారించారు. ప్రస్తుతం కేసులో కీలకమైన సమాచారాన్ని సేకరించేందుకు సిట్‌ ముఖ్య వ్యక్తులను ప్రశ్నించడంపై దృష్టి పెట్టింది.

సుబ్బారెడ్డి విచారణలో పాల్గొనడం ద్వారా మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థ భావిస్తోంది. ఆయన వాంగ్మూలం ఈ కేసు దిశను నిర్ణయించేలా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

తిరుమల దేవస్థానం వంటి పవిత్ర ప్రదేశంలో లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యత లోపించడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *