Hathya: ఐదేళ్ళ క్రితం ‘మధ’ చిత్రాన్ని రూపొందించిన శ్రీవిద్యా బసవ ఇప్పుడు ‘హత్య’ పేరుతో ఓ పొలిటికల్ మర్డర్ మిస్టరీని తెరకెక్కించారు. దీనిని ఎస్. ప్రశాంత్ రెడ్డి నిర్మించారు. ఈ నెల 24న జనం ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవివర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సోమవారం జరిగిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకురాలు శ్రీవిద్య బసవ మాట్లాడుతూ, ‘మా తొలి చిత్రం ‘మధ’ విడుదలకు ఎంతో కష్ట పడాల్సి వచ్చింది. కానీ ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగానే చాలా ఏరియాల నుండి పంపిణీదారులే విడుదల చేస్తామంటూ ముందుకొచ్చారు’’ అని అన్నారు. చిన్నప్పటి నుండీ తనకు విజయశాంతి, మాలాశ్రీ తరహాలో యాక్షన్ మూవీస్ చేయాలనే కోరిక ఉండేదని, అది ఈ సినిమాతో నెరవేరిందని ధన్యా బాలకృష్ణ అన్నారు. మళ్ళీ తెలుగు సినిమాలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందని పూజా రామచంద్రన్ తెలిపింది. ఈ చిత్ర సంగీత దర్శకుడు నరేశ్ కుమారన్, కెమెరామేన్ అభిరాజ్ రాజేంద్రన్, ఎడిటర్ అనిల్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.