Narendra Modi: పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా (ఏప్రిల్ 22, 2026) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధితులకు ఘనంగా నివాళులర్పించారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదానికి తలవంచదని, ఉగ్రవాదుల కుట్రలు ఎన్నటికీ నెరవేరవని ఆయన ఉద్ఘాటించారు. ఈ మేరకు బుధవారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక శక్తివంతమైన సందేశాన్ని పంచుకున్నారు.

ఆ చేదు జ్ఞాపకాన్ని స్మరిస్తూ..
గతేడాది సరిగ్గా ఇదే రోజున జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ దాడిలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులతో సహా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
గతేడాది పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులను ఈరోజు స్మరించుకుంటున్నాను. వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరువదు. తమ ఆత్మీయులను కోల్పోయి బాధలో ఉన్న కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని పీఎం మోదీ ఎక్స్ (X) లో పేర్కొన్నారు.
దేశం ఐక్యంగా ఉంది
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ దృఢ సంకల్పంతో ఉందని ప్రధాని స్పష్టం చేశారు. “జాతిగా మనమందరం ఈ దుఃఖంలోనూ, పోరాట పటిమలోనూ ఐక్యంగా ఉన్నాం. భారత్ ఏ రూపంలో ఉన్న ఉగ్రవాదానికైనా తలవంచదు. ఉగ్రవాదుల హీనమైన ఆలోచనలు ఎప్పటికీ విజయవంతం కావు” అని ఆయన హెచ్చరించారు.
ఆపరేషన్ సింధూర్: భారత్ ప్రతీకారం
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్‌పై మెరుపు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సైనిక చర్యలో భారత సాయుధ దళాలు పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను, సైనిక స్థావరాలను తుత్తునియలు చేశాయి. శత్రువులకు గట్టి బుద్ధి చెప్పడంలో భారత్ ఎప్పుడూ వెనకాడదని ఈ ఆపరేషన్ నిరూపించింది.
