Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు మణిపూర్‌లో పర్యటించనున్నారు. 2023 మే నెలలో అక్కడ జాతి ఘర్షణలు ప్రారంభమైన తర్వాత మణిపూర్‌కు ఆయన వెళ్లడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా రూ. 8,500 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని మోడీ ఇంఫాల్, చురాచంద్‌పూర్ జిల్లాలను సందర్శిస్తారు. ఈ పర్యటన ద్వారా మైతేయి, కుకీ-జో వర్గాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయనున్నారు. కుకీలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో రూ. 7,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. మైతేయిలు అధికంగా ఉన్న ఇంఫాల్‌లో, చారిత్రక కాంగ్లా కోటలో రూ. 1,200 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.
Also Read: Erika Kirk: “ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తా” – చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్
ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. అలాగే, ప్రధాని హాజరయ్యే కార్యక్రమాలకు వచ్చేవారికి పలు ఆంక్షలు విధించారు. పెన్, వాటర్ బాటిల్, బ్యాగ్, కర్చీఫ్ వంటి వస్తువులను వెంట తీసుకురావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2023లో మణిపూర్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనల కారణంగా 260 మందికి పైగా మరణించారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఘటనల తర్వాత ప్రధాని మోడీ మణిపూర్‌ను సందర్శించకపోవడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి.