Thailand

Thailand: పాఠశాలలో విద్యార్థి విచక్షణారహిత కాల్పులు.. తాత, నానమ్మలతో పాటు ఆరుగురి దారుణ హత్య!

Thailand: థాయ్‌లాండ్‌లో మరోసారి మారణహోమం కలకలం రేపింది. శుక్రవారం (ఆగస్టు 7, 2026) బ్యాంకాక్ సమీపంలోని నొంతబురి ప్రావిన్స్‌లో ఉన్న ‘డెబ్సిరిన్ నొంతబురి’ పాఠశాలలో ఓ విద్యార్థి తుపాకీతో తెగబడ్డాడు. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పాఠశాలకు రాకముందే నిందితుడు ఇంట్లో ఉన్న తన తాత, నానమ్మలను కూడా అదే తుపాకీతో కాల్చి చంపినట్లు పోలీసులు ధృవీకరించారు. అనంతరం అతడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
క్షణాల్లో మారిన దృశ్యం – భయాందోళనల్లో విద్యార్థులు!
ఉదయం వేళ పాఠశాల ప్రారంభమయ్యే సమయంలో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినపడటంతో భయానక వాతావరణం నెలకొంది. దాదాపు 26 రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించగా, ఘటనా స్థలంలో మరో 34 రౌండ్ల సజీవ మందుగుండు సామగ్రి లభ్యమైంది.
  • భయంతో ప పరుగులు: కాల్పుల శబ్దం వినగానే కొందరు విద్యార్థులు తరగతి గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకుని దాక్కున్నారు. మరికొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీసే క్రమంలో 15 మందికి పైగా గాయపడ్డారు.
  • అత్యవసర చికిత్స: ఘటన తెలిసిన వెంటనే వందలాది మంది పోలీసులు, పారామెడికల్ సిబ్బంది పాఠశాలకు చేరుకుని బాధితులను ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఒక మహిళా ఉపాధ్యాయురాలిని కాపాడేందుకు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అత్యవసర సిబ్బంది తెలిపారు.

దర్యాప్తుకు ఆదేశించిన థాయ్ ప్రభుత్వం

ఈ ఘోర ఘటనపై థాయ్‌లాండ్ ప్రధాని అనుటిన్ చార్న్‌విరాకుల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన.. బాధితులకు అన్ని విధాలా వైద్య, మానసిక సహాయం అందించాలని విద్యాశాఖ, పోలీసు అధికారులను ఆదేశించారు. నిందితుడు కుటుంబ సభ్యుల తుపాకీని ఎలా చేజిక్కించుకున్నాడు, ఈ దాడి వెనుక ముందస్తు ప్లాన్ ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
ప్రతి ఏడుగురిలో ఒకరి వద్ద ఆయుధం ఉండేలా, దాదాపు కోటి వరకు తుపాకులు చలామణిలో ఉన్న థాయ్‌లాండ్‌లో పాఠశాలల్లో పిల్లల భద్రత, ఆయుధ నియంత్రణ చట్టాలపై ఈ ఘటన మరోసారి తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *