Serial Killer Arrested

Serial Killer Arrested: 16 హత్యలు.. అడవుల్లో గుడారాలు.. చేతిలో పసికందుతో పారిపోతుండగా అరెస్ట్!

Serial Killer Arrested: బ్రెజిల్‌లో ఏకంగా 16 మందిని అతి కిరాతకంగా పొట్టనబెట్టుకున్న కరుడుగట్టిన సీరియల్ కిల్లర్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. 33 ఏళ్ల జోర్లాన్ లోప్స్ డా సిల్వా అనే ఈ హంతకుడు పోలీసుల కళ్లుగప్పి ఏళ్ల తరబడి తప్పించుకు తిరుగుతున్నాడు. అతని బక్కపల్చని శరీరాకృతి కారణంగా స్థానికులు అతన్ని ‘మస్కిటో’ (దోమ) అని పిలుస్తుంటారు. చివరికి పోలీసుల చేతికి చిక్కకుండా ఉండేందుకు మహిళ వేషధారణ వేసుకుని, చేతిలో గుర్తుతెలియని పసికందును ఎత్తుకుని పారిపోతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.

లేడీ గెటప్ – గుర్తుతెలియని పసికందుతో పరార్ యత్నం..

బ్రెజిల్ ఈశాన్య రాష్ట్రమైన పారైబాలోని ములుంగు అటవీ ప్రాంతంలో పోలీసులు రెండు రోజుల పాటు రాత్రింబవళ్లు విస్తృతంగా గాలించారు. అడవిలోని తన రహస్య గుడారానికి చేరుకోలేక నిస్సహాయ స్థితిలో పడిన జోర్లాన్.. పోలీసులను బోల్తా కొట్టించేందుకు నలుపు-తెలుపు చారల మహిళల గౌను, విగ్గు ధరించి, చేతి గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకుని పక్కాగా మహిళలా మారిపోయాడు.
అనుమానం రాకుండా ఉండేందుకు ఎవరిదో తెలియని చిన్న పసిగుడ్డును చేతుల్లో ఎత్తుకుని పారిపోవడానికి యత్నించాడు. అయితే పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి అతన్ని చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. ఆ శిశువుకు ఇతనితో ఎలాంటి రక్తసంబంధం లేదని అధికారులు నిర్ధారించారు.

అడవుల్లో క్యాంపులు – 13 ఏళ్లకే మొదటి హత్య..

రియో డి జనీరోకు దాదాపు 2,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవుల్లో తాత్కాలిక టెంట్లు వేసుకుని నివసించడం వల్ల ఇతను ఇన్నాళ్లూ పోలీసులకు దొరకలేదు. వివిధ ప్రాంతాల్లో జరిగిన హత్యల వెనుక ఒకే వ్యక్తి ఉన్నాడనే విషయాన్ని గుర్తించడం కూడా పోలీసులకు కష్టతరంగా మారింది.
గత మూడు నెలల్లో ములుంగు ప్రాంతంలో జరిగిన పలు హత్యలతో ఇతనికి లింకులు ఉన్నాయి. ఇటీవల ఒక పబ్లిక్ స్క్వేర్‌లో 18 ఏళ్ల యువకుడిని కాల్చి చంపిన కేసును దర్యాప్తు చేయగా అసలు గుట్టు రట్టయింది.

కేవలం 13 ఏళ్ల వయసులోనే తాను మొదటి హత్య చేసినట్లు జోర్లాన్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. తాను కేవలం నేరస్థులనే టార్గెట్ చేశానని, ఇది తన “వ్యక్తిగత యుద్ధం” అని అతడు చెబుతున్నప్పటికీ.. అమాయకులను కూడా నిర్దాక్షిణ్యంగా చంపినట్లు ఆధారాలు లభించాయని ఇన్వెస్టిగేటర్ డగ్లస్ గర్సియా స్పష్టం చేశారు. నిందితుడి వద్ద లభించిన పసికందు తల్లిదండ్రులు ఎవరనే కోణంలో ఆరా తీయడంతో పాటు, గతంలో జరిగిన మరిన్ని అనుమానాస్పద హత్య కేసులను కూడా తిరిగి తెరిచి విచారిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *